ప్రవీణ్ తొగాడియా ఆచూకి లభ్యం... కేంద్రం నన్ను ఎన్‌కౌంటర్ చేయాలని చూస్తుంది...

 

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సోమవారం ఉదయం అదృశ్యమైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ వార్త కలకలం రేపింది. అదృశ్యమైన ప్రవీణ్ తొగాడియా అదే రోజు సాయంత్రం పార్కులో అపస్మారక స్థితిలో పడివుండటం గమనించిన ఓ వ్యక్తి ఆయన్ను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనారోగ్యం నుంచి కాస్త కోలుకున్న ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన... కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని..."కేంద్ర ప్రభుత్వం నన్ను నిత్యం వేధిస్తోంది. కేంద్రం నా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. కేంద్రం పిలుపు మేరకే గుజరాత్, రాజస్థాన్ పోలీసులు నన్ను నిరంతరం వెంటాడుతున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులు నిత్యం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చారు. కేంద్రం ప్రోద్భలంతో పోలీసులు నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది"  కంటతడి పెట్టారు. హిందూత్వ ఐక్యత గురించి ప్రయత్నిస్తున్నందునే నా గొంతు నొక్కాలని చూసున్నారని... నా ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి" అని తొగాడియా కన్నీరుమున్నీరయ్యారు.