ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు..!!

లోక్‌సభలో కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాసం పెట్టవచ్చునని, ప్రజాస్వామ్యంలో విపక్షాలు చాలా కీలకమని అన్నారు. విపక్షాలకి గౌరవం ఇవ్వాలని, వారికి సంఖ్యాబలం లేకపోయినా చర్చకు సిద్ధపడ్డామన్నారు. ఒకప్పుడు ఇద్దరు సభ్యులతో ఉన్న బీజేపీ ఇప్పుడు బలంగా ఉందని, 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పూర్తి మెజార్టీ బీజేపీ సాధించిందని, కాంగ్రెసేతర పార్టీ ఇలా పూర్తిమెజార్టీ సాధించడం రికార్డ్‌ అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. 

 

 

త్రిపుర లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తిరువనంతపురం లాంటి చోట్ల కూడా బీజేపీ జెండా ఎగురవేయగలుగుతోందని, ఇదంతా దేశ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 15ఏళ్ల తర్వాత అవిశ్వాసంపై చర్చ జరుగుతోందని, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తామెప్పుడూ అవిశ్వాసం పెట్టలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీయే నుంచి బయటకొచ్చినా, చంద్రబాబు ఎప్పటికీ తమకు మిత్రుడే అన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఏపీ రెవెన్యూలోటు భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామన్న ఆయన విభజన చట్టంలో హామీలు దాదాపుగా అమలు చేశామన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు. విభజన తర్వాత ఏపీ సమస్యలేంటో తమకు తెలుసు అంటూ ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.