TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఒడిశా మోదీ.. ఇలాంటి నాయకులే దేశానికి కావాలి

Published on: Fri May 31, 2019 5:53PM

 

మోదీ కేబినెట్ కొలువుదీరింది. కేంద్రమంత్రులుగా అందరూ ప్రమాణం చేశారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు అందరూ నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. అతడే ప్రతాప్ చంద్ర సారంగి. ఈయనను ఒడిశా మోదీ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇంతకీ ఈయనకు ఎందుకు అంత గౌరవం ఇచ్చారంటే.. బీజేపీ తరపున గెలిచిన ఎంపీల అందరిలోకి ఈయనే అత్యంత పేదవాడు.. నిరాడంబరత జీవితం గడుపుతారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చుపెడతారు, గెలిచాక వందల కోట్లు వెనకేసుకుంటారు. కానీ సారంగి తీరు పూర్తీ భిన్నం.

గిరిజనుల కోసం జీవితం అంకితం చేసిన 64ఏళ్ల సారంగికి ఎంతోకాలంగా బీజేపీతో అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ కార్యకర్త అయిన 2004, 2009 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నీలగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బాలాసోర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలైన సారంగి.. ఈసారి ఎన్నికల్లో దాదాపు 12వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదికూడా ఎన్నికల్లో డ‌బ్బు ఖర్చు పెట్టకుండానే సారంగి ఎంపీగా గెలిచారు.

 

 

సారంగి త‌న‌కు జీతంగా వ‌చ్చే సొమ్మునంతా ప్రజా సేవ‌కే వినియోగిస్తూ వ‌స్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు తనకు అందే జీత భత్యాలు, ఆ తర్వాత వస్తున్న పెన్షన్‌ను గిరిజన ప్రాంతాల్లో పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సారంగి ఇప్పటికీ పూరిగుడిసెలోనే జీవిస్తుంటారు. సైకిల్ పైనే ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. భుజానా సంచీ వేసుకొని కుర్తా పైజామాలో సాదాసీదాగా కనిపిస్తారు. సారంగి నిరాడంబర జీవితం, సైద్దాంతిక నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఈకారణంగానే కేంద్ర సహాయమంత్రి బెర్త్ దక్కింది. పశుసంవర్థక, మత్స్యశాఖను మోదీ కేటాయించారు.