బీటీ వర్సెస్ యూటీ.. కేసీఆర్‌కు పీకే సర్వే షాకింగ్..
Published on: Tue Mar 8, 2022 4:37PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఊహించినట్లే జరుగుతోంది. ముచ్చటగా మూడో సారి సీఎం పీఠం ఎక్కేందుకు ఆయన చేసే ప్రయత్నాలకు గతంలో ఆయన వెంట నడిచిన వారే చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. తన సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఇది ఒక్కటే కాదు.. తన టీమ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిపింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు గల కారణాలను తన నివేదికలో ప్రశాంత్ కిషోర్ సోదాహరణగా వివరించినట్లు తెలుస్తోంది. సదరు సర్వే నివేదికను ఇటీవల సీఎం కేసీఆర్ ఎదుట ప్రశాంత్ కిషోర్ ఉంచడం.. దీంతో ఈ అంశాలను చూసి కేసీఆర్ కంగుతిన్నట్లు తెలుస్తోంది.
అధికార టీఆర్‌ఎస్‌పై తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఎన్నో ఏళ్లుగా వారు కారు పార్టీలో కొనసాగుతున్నప్పటికీ వారు సంతోషంగా లేరని సమాచారం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందట. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా? ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారా లేదా? ఉద్యమకారులు, పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న వారు తాజాగా యాక్టివ్‌గా ఉన్నారా లేదా? తదితర అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించి.. ప్రజల నుంచి ప్రశాంత్ కిషోర్ టీమ్ సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ వైఖరిపై ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది.
నాటి నుంచి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ నుంచి పెద్దయెత్తున చేరికలను గులాబీ బాస్ కేసీఆర్ ప్రోత్సహించారు. ఈ క్రమంలో బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్‌తో పోల్చుకుంటే యూటీ(ఉద్యమ తెలంగాణ) బ్యాచ్‌కు చాలా తక్కువ పదవులు దక్కాయని లెక్క తేలింది. కొందరినైతే ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీకే టీమ్ గుర్తించింది.
మరోవైపు ఆనాడు కేసీఆర్ చెప్పారని ఉద్యమ సమయంలో భారీగా నగదు ఖర్చు పెట్టిన వారికి... నేటికి కేసీఆర్ పార్టీ పరంగా కానీ, ప్రభుత్వం పరంగా కానీ ఎలాంటి సాయం అందలేదట. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ తరఫున పోరాడినందుకు పదవిలో ఉండి కేసులు పెట్టిన వారు.. ఇప్పుడు సొంత పార్టీలో తమ కంటే ఉన్నత స్థాయిలో ఉండడాన్ని నాటి తెలంగాణ ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. చిన్న పనుల కోసం వారి వద్దకు వెళ్లాల్సి రావడం పట్ల వారంతా అవమానకరంగా భావిస్తున్నారట. పార్టీ కోసం కొట్లాడి, కేసులు ఎదుర్కొని తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు సొంత పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్న తీవ్ర ఆవేదనలోకి వారంతా జారిపోయారట.
ప్రత్యేకంగా ఉద్యమకారులు, మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న వారి గురించి ప్రశాంత్ కిషోర్ బృందం క్షేత్రస్థాయిలో ఆరా తీసింది. ‘‘ఉద్యమ కారులకు న్యాయం జరిగిందా? మొదటి నుంచి ఉన్నవారు పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారా? వారికెందుకు న్యాయం జరగలేదు? ఇప్పటివరకు వారికెందుకు పదవులు రాలేదు...’’ వంటి ప్రశ్నలకు పీకే టీమ్ సమాధానాలను రాబట్టింది.
ఈ నేపథ్యంలో ఉద్యమకారులంతా పార్టీలో ఉన్నప్పటికీ వారంతా యాక్టివ్‌గా లేరని తేలింది. తమ కోసం పార్టీ అధిష్ఠానం ఏం చేయలేదని, కనీసం పార్టీ కార్యక్రమాలకు సైతం పిలవట్లేదని క్షేత్రస్థాయి నుంచి సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఉద్యమకారులనే పీకే బృందం స్వయంగా కలిసి వారి నుంచే వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
అలాగే, చురుగ్గా ఉన్న నాయకులకు పదవులు అందించడంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఘోరంగా విఫలమైనట్లు సర్వేలో గుర్తించారు. ఇక.. ద్వితీయ శ్రేణి నాయకులు అధికారులను ఇబ్బంది పెడుతూ, వారిపై పెత్తనం చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయలేకపోతున్న విషయాన్ని కూడా పీకే టీమ్ తమ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏంటన్న అంశాలపైనా కూడా సర్వే చేపట్టారు. మొత్తంగా పార్టీలో వర్గాలు, ఉద్యమకారుల తిరుగుబాటు, కుల సమీకరణాలు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ తాజా సర్వే.. బయటకు పొక్కడంతో.. ఇదంతా వాస్తవమేనని తెలంగాణ సమాజం స్పష్టం చేస్తోంది. ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతి అయి.. మరణించారు. అతని తల్లి.. శంకరమ్మ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఇక్కట్లు పడిందో అందరికి తెలుసునని ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గుర్తు చేస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే రిపోర్ట్ నేపథ్యంలో కేసీఆర్... రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.


