పీకేకు పంజాబ్ సవాల్

ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. రాజకీయ పార్టీల జాతకాలను, రాజకీయ నాయకుల తల రాతలను మార్చే మాంత్రికుడిగా ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వారు రాజకీయ మీడియా వర్గాల్లో ఉండరు. నిజానికి రాజకీయ మీడియా వర్గాల్లో మాత్రమేకాదు, మాములు జనాలకు కూడా ఆయన పేరు సుపరిచితమే కావచ్చును. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే, ఆయన  చాలా చాలా సుపరిచిత వ్యక్తి. ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీని గెలిపించింది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది,ఈ మాంత్రికుడే అంటారు.గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో, నడిచింది వైఎస్ అయినా నడిపించివాడు కేవీపీ అన్నట్లుగా, జగన్ రెడ్డిని అధికార పీఠం ఎక్కించిన పాదయత్రలో నడిచింది, జగనే అయినా నడిపించిన వాడు మాత్రం ప్రశాంత్ కిషోర్’ అంటారు. 

సుమారు గత దశాబ్దకాలంలో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు,చాలా పార్టీలకు రాజకీయ, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. అలా అందరికీ తెలిసిన రాజకీయ పండితుడిగా ప్రసిద్ధి చెందారు. మధ్యలో స్వయంగా రాజకీయ అరంగేట్రం చేశారు, స్వీయ రాజకీయ భవిష్యత్’ను పరీక్షించుకున్నారు.
అయితే ఇప్పడు ఈ ఉపోద్ఘాం ఎందుకంటే, ఇప్పుడు ఆయన్ను మరో అదృష్టం వరిచింది. ఇప్పటికే అయన చేతిలో రెండు మూడు కీలక ప్రాజెక్టులున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మళ్ళీ గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహ కర్తగా, ప్రచార సలహా దారుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎన్నికల వ్యూహ కర్త, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతూ, నినాదాలకు ప్రతి నినాదాలు అందిస్తూ షా’కు చెక్ పెట్టేలా పావులు కడుపుతున్నారు. అంతే కాదు, బెంగాల్’లో బీజేపీకి 200 లకు పైగా స్థానాలు వస్తాయని అమిత షా ధీమా వ్యక్తం చేస్తే, ప్రశాంత్ కిషోర్’ అంతోటి ఆయన గాలి యిట్టె తీసేశారు.  టూ హండ్రెడ్  కాదు,బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య టూ డిజిట్, రెండంకెలు దాటదు, దాటితే ట్విట్టర్  సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.

అదలా ఉంటే, ఇప్పుడు ఆయన్ని కొత్తగా వరించిన అదృష్టం, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆయన్ని, క్యాబినెట్ రాంక్ పోస్టు ఇచ్చి తమ సలహాదారుగా తీసుకున్నారు.ప్రశాంత్  కిషోర్, 2017లోనూ పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ నేపధ్యంలో, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరో మారు ప్రశాంత్ కిషోర్’ను కీలక పదవిలోకి తెసుకోవడంతో, అయన నియామకం  మరింత ప్రాధాన్యత   సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకరి కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలే ప్రశాంత్ కిషోర్’తో టచ్’లో ఉన్నట్లు సమాచారం.