ఈవీఎంల భద్రతపై ప్రణబ్‌ ముఖర్జీ ఆందోళన

 

సార్వత్రిక ఎన్నికలు బాగా నిర్వహించారని, ఎన్నికల సంఘం పనితీరు భేష్‌ అంటూ ప్రశంసించిన ఒక్కరోజులోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈవీఎంల భద్రతపై వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందని, అయితే ఈవీఎంల భద్రతపై ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని ఆయన పేర్కొన్నారు.  

‘‘ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై నేను ఆందోళన చెందాను. ఈవీఎంల రక్షణ, భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదే. ప్రజాస్వామ్య మూలాలను సవాలు చేసేలా ఊహాగానాలు రావడం సరికాదు. ప్రజల తీర్పు చాలా ఉన్నతమైనది. మన వ్యవస్థలపై దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. మన వ్యవస్థల సమగ్రత బాధ్యత ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంది. ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాల్సి ఉంది’ అని ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ఈసీ పనితీరుపై ముందు నుంచి విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ మోదీ కమిషన్ లాగా మారిపోయిందని విమర్శించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా మోదీకి ఎన్నికల సంఘం లొంగిపోయిందని ఆరోపించారు. అయితే ప్రణబ్‌ముఖర్జీ మాత్రం ఈసీ పనితీరు బాగుంది అంటూ పరోక్షంగా విపక్షాలను తప్పుపట్టారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్, పంజాబ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వస్తున్న వార్తలు కలకలం రేపుతున్న నేపథ్యంలో.. ప్రణబ్‌ముఖర్జీ తాను ఆందోళన చెందుతున్నట్లు వ్యాఖ్యలు చేశారు.