రాష్ట్రపతి ప్రణబ్ ఎన్నిసార్లు క్రిమినల్స్ ని ఉరి కంబం ఎక్కించారో తెలుసా?

 

ఇప్పుడు అందరి దృష్టీ తరువాతి రాష్ట్రపతి ఎవరనే దానిపైనే వుంది! కాని, దేశ ప్రథమ పౌరుడి హోదాని మరికొన్ని రోజుల్లో వదులుకోబోతున్న ప్రణబ్ ముఖర్జీ ఏం  చేస్తున్నారు? ప్రస్తుత భారత రాష్ట్రపతి అయిన ఆయన కేవలం ప్రెసిడెంట్ కి మాత్రమే వుండే ప్రత్యేక అధికారాన్ని సద్వినియోగం చేశారు! రెండు క్షమాభిక్ష అభ్యర్థనల్ని తిరస్కరించి మొత్తం 30 క్షమాభిక్షల్ని తొసిపుచ్చిన రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు!

 

భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు ఉరిశిక్ష వేసిన ఖైదీకి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి వుంటుంది. అయితే, మిగతా అన్ని అంశాల్లాగే ఇది కూడా కేంద్ర మంత్రి వర్గం వ్యక్తం చేసిన అభిప్రాయం మేరకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సి వుంటుంది. కాని, ఇప్పటి వరకూ ఒక్కో రాష్ట్రపతి ఒక్కో పద్ధతిలో క్షమాభిక్ష వ్యవహారాల్ని డీల్ చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి తాజాగా రెండు క్షమాభిక్షల్ని తిరస్కరించి మొత్తం ముప్పై అభ్యర్థనల్ని కాదన్న వారిగా నిలిచారు! అయితే, ప్రణబ్ కంటే ముందు ప్రెసిడెంట్ గా వున్న ప్రతిభా పాటిల్ సరిగ్గా ముప్పై క్షమాభిక్షల్నే అంగీకరించటం ఇక్కడ పెద్ద విశేషం! ఆమె తన అయిదేళ్ల కాలంలో ముప్పై క్షమాభిక్షలు పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంది!

 

సాధారణంగా భారతీయ కోర్టులు అత్యంత కరుడుగట్టిన ఉన్మాదులకి తప్ప ఉరిశిక్షలు వేయవు. అందుకే, మన రాష్ట్రపతులు అంత త్వరగా క్షమాభిక్ష పెట్టరు. తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎందుకని అంత మందికి క్షమాభిక్ష మంజూరు చేశారోగాని.. యాకుబ్ మెమన్ తో సహా ఎవ్వర్నీ కరుణించలేదు ప్రణబ్ దా! తాజాగా కూడా రెండు కేసుల్లో రేపిస్టుల్ని, మర్డర్లు చేసిన వార్ని ఆయన ఉరి తీయాల్సిందేనంటూ సంతకం చేశారు. ఇక తనదైన స్టైల్లో పని చేసిన డిఫరెంట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలామ్ కేవలం రెండు క్షమాభిక్షలపైన నిర్ణయం తీసుకున్నారు. కేఆర్ నారాయణన్ తన అయిదేళ్ల కాలంలో ఒక్క పీటీషన్ పైన కూడా నిర్ణయం తీసుకోలేదు!

 

ముప్పై మెర్సీ పీటీషన్లు తిరస్కరించిన ప్రణబ్ ముఖర్జీ చాలా మంది రాష్ట్రపతుల కంటే కఠినంగా వ్యవహరించినట్టే. కాని, ఆయనకంటే టఫ్ గా నేరస్థుల్ని ఉరికంబం ఎక్కించారు ఆర్. వెంకట్రామన్. 1987-1992 మధ్య కాలంలో ఆయన అత్యధికంగా 44 క్షమాభిక్ష పీటషన్లు తిరస్కరించారు!