ప్రణబ్ బడ్జెట్..లగ్జరీ మరింత ప్రియం
Published on: Fri Mar 16, 2012 1:09PM
న్యూ
ఢిల్లీ: ఎక్సైజ్ డ్యూటీని 22 శాతం నుంచి 24 శాతానికి పెంచుతున్నట్టు ఆర్దికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. దీంతో కార్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇకపై లగ్జరీ వస్తువులు, హోటల్లో భోజనం, విందు-వినోదాలు, విమానాల్లో ప్రయాణాలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సర్వీస్ టాక్స్‌ను పెంచడంద్వారా 19 వేల కోట్లరూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ మేరకు సేవాపన్నును 10 నుంచి 12 శాతానికి పెంచారు. ఫలితంగా మొబైల్ బిల్లుల ధరలు కూడా పెరగనున్నాయి.
ఉద్యోగులను ఊరిస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ప్రణబ్ బడ్జెట్‌లో ప్రస్తావించారు. పన్ను పరిమితిని 2 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ఆయన చెప్పారు. రూ.2 లక్షల నండి రూ.5 లక్షల వరకు ఆదాయంపై పది శాతం పన్ను, రూ.5 లక్షల నుండి రూ.పది లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను, పది లక్షలకు పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌బి ఖాతాలో రూ.10వేల ఖాతాపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎస్‌బి ఖాతాలపై పదివేలమదుపుపై పన్ను మినహాయింపును ఆయన ప్రకటించారు. వృద్ధులకు, మహిళలకు గరిష్ట ఆదాయం పన్ను పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ధారించారు. పరిశ్రమలకు పన్ను మినహాయింపు కోసం టర్నోవర్ పరిమితి కోటి రూపాయలకు పెంచారు. కార్పొరేట్ పన్ను యధాతథంగా ఉంచారు. రూ. 2 లక్షల బంగారం కొనుగోళ్లపై తక్షణ టిడిఎస్ ఉంటుందని చెప్పారు. సినీ రంగానికి సేవా పన్ను మినహాయించారు. సర్వీస్ టాక్స్, సెంట్రల్ ఎక్స్జైజ్‌కు కామన్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు. సేవా పన్ను పరిధి నుంచి విద్య, ప్రభుత్వ సేవలు, వినోదం వంటి 17 సేవలను మినహాయించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఆయన ప్రత్యేక నిధులు కేటాయించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే హైదరాబాదులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. అలాగే, గుంటూరుతోపాటు ప్రకాశం జిల్లాలోనూ చేనేత సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బడ్జెట్‌లోని ఇతర విషయాలు ప్రస్తావిస్తూ విమాన ఇంధనాన్ని ఇకపై నేరుగా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 50 వేల రూపాయల పన్ను మినహాయింపు కల్పిస్తున్నామన్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్‌కు ఆర్థిక మంత్రి ప్రణబ్ బడ్జెట్ ప్రసంగంద్వారా తీపి కబురు అందించారు. ఈ ఏడాది విమానయాన రంగంలో 100 కోట్ల డాలర్ల వరకు విదేశీ రుణాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
దేశంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందని ప్రణబ్ అన్నారు. ఈ క్రమంలో సర్వశిక్షా అభియాన్ పథకానికి 25,555 కోట్ల రూపాయలు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
దేశంలో కొత్తగా 8800 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మించి రవాణా సదుపాయాలు మెరుగు పరుస్తామన్నారు. వచ్చే దశాబ్దంలో వ్యవసాయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
దేశంలో ఉన్న వితంతువులు, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం 200 రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రణబ్ తెలిపారు. అలాగే చేనేత కార్మికులకు 388ల కోట్ల రూపాయల మేర వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వ్యవసాయ రుణాలను ఈ ఏడాది 5.75 లక్షల కోట్ల వరకు అందిస్తామన్నారు. చేపల పెంపకానికి 500 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. గిడ్డంగుల కోసం 5 వేల కోట్లు సమకూరుస్తామన్నారు.


