TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేరగాళ్ళ జాబితాలో 40 మంది ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. లు

Published on: Sat May 5, 2012 12:29PM

"దొరికితే దొంగ ... దొరకకపోతే దొర'' తెలుగునాట అందరికీ తెలిసిన సామెత ఇది. తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఐ.పి.ఎస్. అధికారి ప్రమోద్ కుమార్ ఒక చిట్ కంపెనీ నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుంటూ సిబీఐ కి పట్టుబడ్డారు. మన రాష్ట్రంలో ఐ.ఎ.ఎస్. అధికారిని శ్రీమతి శ్రీలక్ష్మి దొరికిన దొంగ. మరి దొరకని దొంగ దొరల సంగతి ఏమిటి? ఇది చాలా మంది మనసులను వేధిస్తున్న ప్రశ్న. సిబీఐ కేవలం శ్రీలక్ష్మిపైనే కేసు నమోదు చేయలేదు. అందుబాటులో వున్న సమాచారం ప్రకారం 2012 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 40 మంది ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లపై కేసులు దాఖలు అయ్యాయి. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఆచార్య, శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం సిబీఐ అధికారులు ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లపై కేసులు దాఖలు చేయాలంటే కేంద్రహోమ్ మంత్రి నుంచి అనుమతి తీసుకోవాలి.

 

 

దేశవ్యాప్తంగా 110 ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లపై కేసునమోదు చేయడానికి అనుమతి కోసం సిబీఐ అధికారులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి సాయంగా రాజ్యసభలో ఒక రాతపూర్వక ప్రశ్నకు స్వయంగా సమాధానం చెప్పారు. ఈ అధికారులందరూ పలు అవినీతికర పనులు చేస్తూ పట్టుబడినవారే. వీరిని అరెస్టు చేయడానికి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. కాబట్టి ఈ దొంగ అధికారులందరూ దొరలే. న్యాయస్థానం నేరుగా ఆదేశించడం వల్ల శ్రీలక్ష్మి అరెస్టుకు కేంద్రప్రభుత్వం వెంటనే అనుమతించింది. లేదంటే ఆమెకూడా దొరకని దొరల జాబితాలోనే వుండివుండేవారు. 90వ దశకానికి ముందు ఆనాడు ప్రధానమంత్రిగా వున్న రాజీవ్ గాంధీ ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వినియోగించే ప్రతిరూపాయిలో కేవలం 17పైసలు మాత్రమే ప్రజలు చేరుతోందని వ్యాఖ్యానించారు. నేటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివృద్ధి కార్యక్రమాలకు చేసే వ్యయంలో 26 పైసలు మాత్రమే సద్వినియోగం అవుతున్నట్లు ప్రకటించారు. వీరి మాటలను నిజం చేస్తూ మనదేశంలో ఏడాదికి రూ.2,50,000 కోట్ల మేరకు అవినీతి జరుగుతున్నట్లుగా అవినీతిపై సర్వేచేసిన ఒక సంస్థ ప్రకటించింది.