ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టించిన ప్రగతి నివేదన సభ

 

ప్రగతి నివేదన సభ.. తెరాస కలల సభ.. ఈ నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సభ.. భారీ జనసమీకరణతో తెరాస పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారో తెలుపుతూ ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టించాలని భావించి చేపట్టిన సభ.. మరి అనుకున్న స్థాయిలో ఈ సభ విజయం సాధించిందా?.. తెరాస శ్రేణులు మాత్రం 'ప్రగతి నివేదన సభ' పట్ల సంతోషంగా ఉన్నారు.. సభ విజయం సాధించిందని గర్వంగా చెప్తున్నారు.. వారి సంతోషం వెనుక కూడా కారణం ఉందిలేండి.. ట్రాక్టర్లు, బస్సులు, కార్లు ఇలా వేల వాహనాల్లో లక్షలాదిగా తెరాస కార్యకర్తలు తరలివచ్చారు.. సభ ప్రాంగణం ఆకాశంలా, కార్యకర్తలు నక్షత్రాలలా కనపడడంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.. అనుకున్నట్టే జనసమీకరణ చేయగలిగామని తెరాస నాయకత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.. మొత్తానికి తెరాస శ్రేణులు 'ప్రగతి నివేదన సభ' పెద్ద హిట్టు అంటూ గర్వంగా చెప్తున్నాయి.

 

 

అయితే ఈ సభపై ప్రతిపక్షాల స్పందన వేరేలా ఉంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ సప్పగా సాగింది అంటూ విమర్శిస్తూ, సభ ప్లాప్ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.. ' ప్రగతి నివేదన సభ' పెట్టి అసలేం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? ఏం సాధించారు? అని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తుంది.. వందల కోట్లు ధనం వృధా, ప్రజల సమయం వృధా.. అసలు ఈ సభ పెట్టి ప్రజలకు చెప్పాలనుకున్నారు.. ఎప్పుడు చెప్పే నాలుగు మాటలు చెప్పి పంపించారు.. జనసమీకరణ కూడా 25 లక్షలు అన్నారు కానీ సభకి వచ్చినవాళ్లు 10 లక్షలు కూడా ఉండరంటూ విమర్శిస్తోంది.. మొత్తం కాంగ్రెస్ మా దృష్టిలో సభ ఫట్టు అన్నట్టు చెప్తోంది.. కానీ తెరాస మాత్రం ఏం చేసినా ప్రతిపక్షాలు విమర్శించటం కామనేగా అని లైట్ తీసుకుంటుంది.. అంతేకాదు సభకి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ ఓర్వలేక ఇలా మాట్లాడుతుందని కొందరు, సభని చూసి కాంగ్రెస్ భయపడి పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని మరికొందరు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు.. ఎవరేమనుకున్నా సభ హిట్టు, ఆ విషయం ప్రపంచానికి తెల్సు అంటూ తెరాస గర్వంగా చెప్తుంది.