ప్రభాసే నాకు దైర్యం చెప్పేవారు: రాజమౌళి

 

శనివారం రాత్రి తిరుపతి యస్వీ యూనివర్సిటీ మైదానంలో బాహుబలి ఆడియో రిలీజ్ చాలా అట్టహాసంగా, విభిన్నంగా, చాలా సరదా సరదాగా ముగిసింది. సినిమాను ఎలాగూ ఆయన తనకి నచ్చినట్లు తీసుకొంటారు. కానీ ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పై కూడా ఆయన ముద్ర స్పష్టంగా కనబడింది. సుమారు మూడేళ్ళ పాటు నిర్విరామంగా శిల్పం చెక్కినట్లు బాహుబలిని చెక్కిన జక్కన రాజమౌళికి అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే! ఈ సినిమా ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారని? కానీ దానికి ఆయన నేరుగా జవాబు చెప్పకుండా చాలా త్వరలోనే అని తప్పించుకొన్నారు. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన ప్రభాస్, రాణా, నాజర్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితర తారలందరూ హాజరయ్యారు.

 

రాజమౌళి మాట్లాడుతూ “ఈ సినిమా షూటింగ్ అనుకొన్న సమయం కంటే సుదీర్ఘంగా సాగుతున్నప్పుడు నేను చాలా ఆందోళన చెందేవాడిని. కానీ ప్రభాస్ ఎప్పుడూ కూడా నాకు దైర్యం నూరిపోసేవాడు. అసలు ఆ స్థాయి హీరో ఏడాది డేట్స్ అడిగితే రెండేళ్ళు ఇవ్వడమే కాకుండా సినిమా పూర్తీ అయ్యేంతవరకు కూడా ఎన్నడూ అభ్యంతరం చెప్పకుండా ఎంతో సహకరించారు. పైగా ఆయనే ఒక అంతర్జాతీయ స్థాయిలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాను మనం చేస్తున్నామని ఆయనే నాకు చాలా దైర్యం చెప్పేవారు. మా మొదటి సినిమా ఛత్రపతికి ఆయన ఎంతగా కష్టపడ్డారో అంతకు వందరెట్లు ఈ బాహుబలి సినిమా కోసం ఆయన కష్టపడ్డారు. ఆయనిచ్చిన ప్రోత్సాహం, సహకారం ఎన్నటికీ మరిచిపోలేను, అని ప్రభాస్ ని తనివితీరా పొగిడేశారు.