మాటే మంత్రం కావాలంటే

ఏ సందర్భంలో అయినా గడగడా మాట్లాడేసినంత మాత్రాన మనకి వాక్చాతుర్యం ఉందని మురిసిపోవడానికి లేదు. ఎవరి ముందైనా కూడా జంకు లేకుండా ఉపన్యాసం దంచేసినంత మాత్రాన మనం గొప్ప వక్తలం అనుకోవడానికీ లేదు. మనం చెప్పే మాట అవతలివారికి వినపడాలి. అది స్పష్టంగా అర్థమవ్వాలి. స్వరం కూడా వినసొంపుగా ఉండాలి. అప్పుడే మనం పలికే పదానికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఉత్త కంఠశోష మాత్రమే మిగులుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు.

 

సరైన శ్వాస:

ఆరోగ్యంగా ఉండాలంటే గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని అందరూ చెప్పే విషయమే! ఇలా ఊపిరితిత్తుల లోతుల నుంచి ఊపిరి పీల్చుకునే అలవాటు వల్ల మన మాటలో కూడా మార్పు వస్తుంది. మాటని బలంగా చెప్పగలుగుతాం. కావాలంటే గట్టిగా ఊపిరి తీసుకుని మాట్లాడి చూడండి... మీ మాటల్లోని మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

నిదానంగా:

భయంతోనో, మనసులో మాటని త్వరత్వరగా చెప్పాలన్న ఉద్విగ్నతతోనో మనం హడావుడిగా మాట్లాడతాం. భాష మీద పట్టుంటే త్వరగా మాట్లాడగటం అన్న అపోహ కూడా చాలా మంది ఉంది. అందుకనే భారతీయులు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు హడావుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల అసలుకే ఎసరు తప్పదు. తప్పులుతడకలుగా మాట్లాడటమో, తడబడటమో, మన మాట అవతలివారికి అర్థం కాకపోవడమో జరుగుతుంది. ఉపన్యాస కళ మీద మంచి పట్టు ఏర్పడే వరకు కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడటమే మంచిది.

 

రికార్డు చేసుకుని:

ఎవరి మాటలు వారి చెవులకు అద్భుతంగానే తోస్తాయి. కానీ మన మాటలు అవతలివారికి ఎలా వినిపిస్తుందో గ్రహించం. అందుకోసం ఒక్కసారి మన మాటల్ని మనమే రికార్డు చేసుకుని వింటే మన శ్రావ్యమైన గొంతు మీద మనకి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతో ఎలాగైనా సరే మనం మాట్లాడే తీరుని మార్చుకోవాలన్న పట్టుదల ఏర్పడుతుంది.

 

గొంతు తెరచి:

చాలామంది మాట్లాడుతుంటే ఊరికనే పెదాలని ఆడిస్తున్నట్లు కనిపిస్తుందే కానీ స్పష్టత ఉండదు. నోరు పూర్తిగా తెరిచి మాట్లాడకపోతే మన మాటలు గొణుగుతున్నట్లుగానే వినిపిస్తాయి. నోరు పూర్తిగా తెరుకుని మాట్లాడినప్పుడు పెదాలు కూడా విచ్చుకుంటాయి. నాలుకా, కింద దవడలు కూడా కదులుతూ ఉన్నప్పుడు పదాలను స్పష్టంగా, దృఢంగా పలకగలుగుతాం.

 

వ్యాయామం:

సంగీత స్వరాల మీద పట్టు సాధించేందుకు మన పెద్దలు చన్నీళ్లలో గొంతు వరకూ మునిగి సాధన చేసేవారట. అంత కష్టం మనవల్ల కాదు కానీ స్వరం మెరుగుపడేందుకు చాలా వ్యాయామాలే ఉన్నాయి. ఉదాహరణకు Cicely Berry వ్యాయామం పేరుతో ఇంటర్నెట్లో శోధిస్తే కొన్ని పదాలు కనిపిస్తాయి. వీటిని కనుక పలుకుతూ ఉంటే మన ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సంస్కృత శ్లోకాలని చదవడం, Tongue twistersని అభ్యసించడం వల్ల కూడా ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతారు.

- నిర్జర.