అనంత, ఉత్తరాంధ్రేనా మిగిలిన జిల్లాల సంగతేంటి పవన్..?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఇంత వరకు పార్టీ సంస్థాగతంగా వేళ్లూనుకోలేదు. సిద్ధాంతపరంగా కాగితాల్లో పార్టీ ఎంత పటిష్టంగా కనిపిస్తున్నా..అసలు ఒక క్రీయాశీలక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో అలాంటి నిర్మాణం జనసేనలో కనిపించడం లేదు. రీసెంట్‌గా అనంతపురంలో జనసైనికుల కోసం దరఖాస్తులు ఆహ్వానించాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైనా ముందడుగు పడింది అంటే అదొక్కటే. ఏ ప్రెస్ మీట్ పెట్టినా అనంతపురం అంటాడు తప్పించి మరో జిల్లా కానీ..నియోజకవర్గం గురించి కానీ ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు.

 

ఇలాంటి దశలో శ్రీకాకుళంలో జనసేన శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు పవన్. పార్టీకి ఏ రకమైన సేవలు అందించగలరన్న ప్రాధాన్యతపై అభ్యర్ధులను ఎంపిక చేసుకోనున్నారు. ముఖ్యంగా కంటెంట్ రైటర్స్, అనలిస్ట్స్, స్పీకర్స్ కోసం జనసేన అన్వేషిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ముఖ్యంగా అనంతపురం, ఉత్తరాంధ్రపై పవన్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటా అని విశ్లేషించే పనిలో పడ్డారు సీనియర్ మోస్ట్ అనలిస్టులు. అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలు. కరువు, వలసలు, నిరక్ష్యరాస్యత సమస్యలు మెండు..అందుకే పార్టీ ఆవిర్భవించిన తరువాత ఈ రెండు ప్రాంతాల్లో పర్యటనలు చేసి సమస్యలు తెలుసుకున్నారు జనసేనాని.

 

గోదావరి జిల్లాల్లో ఎలాగూ పవన్‌కు తిరుగు లేదు..కృష్ణా నుంచి నెల్లూరు వరకు ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. సీమలోనూ ప్రభావం చూపగల సత్తా ఉంది. ఏటొచ్చి ఉత్తరాంధ్ర, అనంతలోనే పార్టీకి బలాన్ని ఇవ్వాలి కాబట్టే..తొలి విడతగా ఆ రెండు ప్రాంతాల నుంచి జనసేవకులను ఎంపిక చేసుకుని తన ఉద్దేశ్యం ఏంటో చెప్పకనే చెప్పాడు పవన్. ఇక్కడ సక్సెస్ అయితే గనుక జనసేనకు తిరుగులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.