TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్‌ ఎంట్రీతో కేసీఆర్‌ లెక్కలు గల్లంతవుతాయా?

Published on: Wed Mar 15, 2017 3:19PM

గెలుస్తానో లేదో తెలియదు గానీ...పోటీ చేయడం మాత్రం పక్కా అంటూ అనంతపురం సభలో ప్రకటించి.... ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు పుట్టించిన  పవన్ కల్యాణ్‌.... ఇఫ్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి.... తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టించారు. ఏదో ఆషామాషీగా...పవన్‌ ఈ ప్రకటన చేశారనుకుంటే తప్పులో కాలేసినట్లే. తెలంగాణలో తనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సీమాంధ్రుల జనాభా... ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కగట్టే పవన్‌ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఫుల్‌ స్వింగ్‌ మీదున్న కేసీఆర్‌‌కు, టీఆర్‌ఎస్‌కు ఇది కలవరం పుట్టించే అంశమే. రాజకీయాల్లో ఎవరినీ తేలిగ్గా తీసేయలేం. అలాంటిది తెలంగాణలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌.... ఎన్నికల బరిలోకి దిగితే ఫలితాలు తారుమారు కావడం అంత కష్టమైన పనేమీ కాదు. ముఖ్యంగా సీమాంధ్రులు అధికంగా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశముంది. అలాగే కొన్నిచోట్ల గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ జనసేన ప్రభావం చూపించే ఛాన్సుంది. పైగా 60శాతం పైగా యువతకు టికెట్లు ఇస్తానంటున్న పవన్‌.... కొత్త తరహా రాజకీయాలతో తెలంగాణ ప్రజల మనసులను కూడా గెలుచుకునే అవకాశం లేకపోలేదు.

 

అయితే ఇప్పటికే ఆంధ్రా పార్టీ ముద్రతో తెలంగాణలో తెలుగుదేశంను నామ రూపాల్లేకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్‌... జనసేన మీద కూడా అలాంటి ముద్రే వేయడం ఖాయం. అయితే తన ఓటు హక్కును ఏపీకి మార్పించుకుని తన స్థానికతపై పిచ్చ క్లారిటీ ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర విభజనపై దాగుడు మూతల్లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసిన పవన్‌... తనకు తెలంగాణ అన్నా, తెలంగాణ భాష అన్నా.... తెలంగాణ ప్రజలన్నా ఎంతో అభిమానమంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అందుకే తన సినిమాల్లోనూ తెలంగాణ మాండలికానికి, భాషకు, పాటలకు ప్రాధాన్యత కల్పిస్తూ... తెలంగాణపై తనకున్న ప్రేమను నిజాయితీగా చాటుకున్నానని ప్రకటించుకున్నారు. ఈ అంశాలే పవన్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. 

 

ఏదిఏమైనా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ, తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ, జెట్‌ స్పీట్‌తో దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌.... పవన్‌ ప్రకటనను అంత తేలిగ్గా తీసుకుంటుందని చెప్పలేం. అసలు తెలంగాణలో జనసేనకు నూకలు ఉంటాయా లేదా అన్నది పక్కనబెడితే.... ఖచ్చితంగా గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా మాత్రం ఉంటుందనేది వాస్తవం. ఆ లెక్కన చూస్తే పవన్‌ ప్రకటన అధికార టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టించే అంశమే.