పరిటాల ఇంట్లో పవన్

పరిటాల రవి- పవన్ కళ్యాణ్ ఒకరితో ఒకరికి ఏ మాత్రం సంబంధం లేని రంగాల్లో ఉన్న వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. దశాబ్ధం పాటు ఇద్దిరి అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అలాంటి పరిటాల రవి ఇంట్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమైతే. అవును.. ఇది నిజం. చలోరే చలోరే చల్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న పవన్ ఇవాళ మంత్రి సునీత ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రితో కలిసి సాగునీటి రంగ నిపుణులతో కలిసి హంద్రీనీవా ప్రాజెక్ట్‌పై చర్చించారు. హంద్రీనీవా వలన కలిగే ఉపయోగాలు.. ఎప్పటిలోగా పూర్తవుతుందనే విషయాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను సునీత దృష్టికి తీసుకెళ్ళారు. అనంతరం పవర్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాయలసీమకు హైకోర్టుతో పాటు ఇతర సమస్యలపై త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తానని చెప్పారు. పవన్ రాకతో సునీత ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. పవర్‌స్టార్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.