త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ కార్డులు
Published on: Mon Feb 27, 2012 3:43PM
హైదరాబాద్: విద్యుత్ శాఖ త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. ప్రభుత్వం ప్రైవేట్ కార్యాలయాలు, గృహాల్లో అనవసర విద్యుత్ వినియోగ కారణంగా విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ప్రతి ఏటా విద్యుత్ కోతలను విధించాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా ప్రీ పెయిడ్ కార్డులు ప్రవేశపెట్టి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ విధానం ద్వారా ప్రతినెలా మొదట ప్రభుత్వం కార్యాలయాలు, క్వార్టర్లకు ఈ ప్రీ పెయిడ్ విద్యుత్ కార్డును సరఫరా చేస్తారు. తద్వారా ప్రభుత్వ విభాగాలనుంచి విద్యుత్ శాఖకు బకాయిల భారం తగ్గుతుందనేది వీరి భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వశాఖల నుంచి విద్యుత్ శాఖకు సుమారు రూ.700 కోట్ల మేర బకాయిలు రావలసి ఉంది. ప్రభుత్వ శాఖల్లో ప్రీ పెయిడ్ విధానం విజయవంతమైతే తర్వాత పట్టణాల్లోని ప్రైవేట్ కార్యాలయాలు, గృహాలకు ఈ విధానాన్ని విస్తరించాలని విద్యుత్ శాఖ యోచిస్తోంది.


