ఆంధ్రప్రదేశ్ లో భారీగా విద్యుత్ కోతలు

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. గ్రామాల్లో వారం రోజుల నుంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. అనేక మండలాల్లో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవటంతో డిమాండ్ పెరగిపోగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి. ఏపీకి ప్రస్తుతం పది నుంచి పదకొండు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది కానీ కేవలం ఎనిమిది వేల మెగావాట్స్ మాత్రమే ప్రస్తుతం విద్యుదుత్పాదన జరుగుతోంది. వర్షాలు పడటంతో పంటల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ మోటార్లను రైతాంగం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారింది. సౌర, పవన, విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరించింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను పున సమీక్షించాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై సౌర, పవన, విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో సౌర, పవన, విద్యుత్ సంస్థలపై ఉన్న విభేదాలతో  వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం విద్యుత్ సరఫరాను తీసుకోవటం నిలిపివేసింది. దీనివల్ల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు థర్మల్ స్టేషన్ల పై ఆధారపడింది. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా పది లక్షల టన్నుల బొగ్గు నిల్వలు కరిగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం బొగ్గు కొరత ఏర్పడింది.

ఒడిశాలో ఉన్న బొగ్గు గనుల నుంచి కూడా సరఫరా తగ్గిపోయింది. మహారాష్ట్రలో ఎన్నికలుండటంతో ఒడిశా నుంచి బొగ్గును మహారాష్ట్రకు తరలించి అక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏపీకి బొగ్గు సరఫరా నిలిచిపోయాయి ఫలితంగా థర్మల్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన తగ్గిపోయింది. అందువల్లే విద్యుత్ కోతలు పెరిగాయి. వివిధ విద్యుత్ కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడంతో జాతీయ విద్యుత్ ఎక్స్ చేంజ్ లో ఏపీని బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు సాధ్యం కాలేదు.వెంటనే నూట ఇరవై ఐదు కోట్లు కొన్ని విద్యుత్ సంస్థలకు చెల్లించింది ఏపీ ప్రభుత్వం .దాంతో ఏపీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే అక్కడ మిగులు విద్యుత్ అమ్మకాలు పూర్తి అయ్యాయి. వివిధ రాష్ట్రాలు తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్ ను ఇప్పటికే వేరే రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విద్యుత్ కొనుగోలుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏ రాష్ట్రం దగ్గరైనా మిగులు విద్యుత్తు ఉందేమోనని ఏపీ అధికారులు వాకబు చేస్తున్నారు. బొగ్గు లభ్యత పూర్తిగా పడిపోవడంతో విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పాదన డెబ్బై శాతానికి పైగా పడిపోయింది. విదేశాల నుంచి ఓడల్లో వస్తున్న బొగ్గుతో ప్రస్తుత ఒక యూనిట్ లో మాత్రం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో యూనిట్ పాక్షికంగా పని చేస్తోంది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.