TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చేతులు కాలాక.. ఏవో పట్టుకున్నట్టుంది!

Published on: Sun Aug 26, 2012 4:05PM

                                                                                                            
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది ప్రభుత్వం తీరు. కాస్తోకూస్తో కరెంటున్నప్పుడు చెప్పాల్సిన  మంచి మాటల్ని ఇప్పుడు పూర్తిగా అంధకారం చుట్టుముట్టాక  బైటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన అమాత్యవర్యులు. అసలే కరెంటు లేక నానా.. అగచాట్లు పడుతున్న జనానికి ఈ మాటలు పుండుమీద కారం చల్లినట్టు సలపరం పెడుతున్నాయి. చేసేది లేదు చచ్చేది లేదుగానీ.. ఊరికే వచ్చాయని మాటలు మాత్రం చెబుతున్నారా అంటూ జనం మండిపడుతున్నారు. రైతులతోపాటుగా మామూలు జనంకూడా తిరగబడి ట్రాన్స్  ఫార్మర్ లను ధ్వంసం చేస్తూ, విద్యుత్ పంపిణీ కార్యాలయాలను ముట్టడిస్తూ, ఉద్యోగుల్ని చావగొడుతుంటే.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో మంత్రులు, అధికారులు ఈ  అదా సూత్రాన్ని వల్లెవేస్తున్నారన్న విషయంకూడా అందరికీ తెలిసిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరంగా నడుస్తున్న ఏసీల్ని, లైట్లను, ఫ్యాన్లను ఆపేయడం, హోర్డింగులకు కరెంట్ ని నిలిపేయడం లాంటి చర్యలు ముందుగా తీసుకునుంటే ఇంత గడ్డుపరిస్థితి ఎదురయ్యేది కాదన్నది సామాన్యులకుకూడా చాలా స్పష్టంగా అర్థమైన సత్యం. మరి మంత్రులకు ఇంత చిన్నవిషయం ఎందుకు అర్థంకాలేదోగానీ.. మొత్తంగా వ్యవస్థ కుప్పకూలిన తర్వాతే ఇలాంటి మంచి ఆలోచనలు అమాత్యులకు పుట్టుకొస్తున్నాయన్న విషయం మాత్రం అందరికీ తెలిసిపోయింది. జనానికి ఇప్పుడు కావాల్సింది ఇట్టాంటి పోచుకోలు కబుర్లు కాదు. ఇబ్బందిని తీర్చే మార్గాలు. ఉత్పత్తిని ఎలా పెంచాలి, అవసరమైతే పొరుగు రాష్ట్రాలనుంచి కొనైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలా చూడాలి అన్న విషయంమీద  ముఖ్యమంత్రి, సంబంధిత  శాఖని చూస్తున్న మంత్రివర్యులు దృష్టిపెడితే కష్టంనుంచి గట్టెక్కడం  ఏమంత కష్టంకాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.