పొట్లూరి వరప్రసాద్ కి వైకాపా టికెట్ ఖరారు..!!

 

ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత మరియు పీవీపీ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్ జనవరి26న వైకాపా తీర్ధం పుచ్చుకోనేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు విజయవాడ లోక్ సభ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

ఆ నియోజక వర్గం క్రింద ఉన్న తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ మరియు తూర్పుప్రాంతాలు ఉన్నాయి. వీటిలో తిరువూరు, నందిగామ ప్రాంతాలు తప్ప మిగిలిన నాలుగు ప్రాంతాలలో కమ్మ కులస్థులదే పూర్తి ఆదిక్యత. అందువల్ల కాంగ్రెస్, తెదేపా, వైకాపా మూడు పార్టీలు కూడా అదే కులానికి చెందిన వ్యక్తులను తమ అభ్యర్ధులుగా నిలబెడుతున్నాయి.

 

ఇప్పటికే తెదేపా అభ్యర్ధిగా కేశినేని శ్రీనివాస్ (నాని) రంగంలో ఉండగా, ఇప్పుడు వైకాపా పొట్లూరి వరప్రసాద్ ను తన అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఇంత వరకు లగడపాటి రాజగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయన అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నందున మళ్ళీ ఆయనకి టికెట్ దొరకక పోవచ్చును. కానీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఆయన ఆ పార్టీ టికెట్ పై పోటీచేయవచ్చును. లేదా స్వతంత్ర అభ్యర్దిగానయినా అక్కడి నుండే పోటీ చేయవచ్చును.

 

ఏవిధంగా చూసినా ఒకే కులానికి చెందిన ఈ ముగ్గురు బలమయిన అభ్యర్ధుల మధ్య చాలా తీవ్రమయిన పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది. అయితే, షెడ్యుల్డ్ కులాల వారి ఆధిక్యత ఉన్న తిరువూరు, నందిగామలు ఎటువైపు మొగ్గితే వారికే విజయం దక్కుతుంది. గనుక అన్ని పార్టీలు ఆ రెండు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజలపై ప్రస్తుతం జగన్ ప్రభావం అధికంగా ఉన్నందున పొట్లూరి వరప్రసాద్ విజయం ఖాయమనే ధీమాతో వైకాపా ఉంది.

 

మచిలీపట్నం నుండి లోక్ సభకు కుక్కల నాగేశ్వరరావుని తన అభ్యర్ధిగా నిలబెట్టాలనుకొన్న వైకాపాకి ఆయన హటాన్మరణంతో మళ్ళీ అంత బలమయిన అభ్యర్ధి కోసం గాలించవలసివస్తోంది. ఆయన కుమారుడు కుక్కల వెంకట విద్యాసాగర్ లేదా పేర్నివెంకట రామయ్య(నాని)ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

మచిలీపట్నం లోక్ సభ నియోజక వర్గం క్రింద ఉండే పెనమలూరు, గన్నవరం, పెడన, గుడివాడ, మచిలీ పట్నం,అవనిగడ్డ, పామర్రు మరియు మచిలీ పట్నం టవున్ ప్రాంతాలలో కాపు మరియు యాదవ కులస్తులు అధికంగా ఉన్నారు. అందువల్ల కాపు కులస్తుడయిన పేర్నివెంకట రామయ్యను లేదా యాదవ కులానికి చెందిన విద్యాసాగర్ లలో ఎవరికో ఒకరికి టికెట్ ఖాయం చేయాలని వైకాపా భావిస్తోంది. విద్యాసాగర్ కు సానుభూతి ఓటు కూడా అదనంగా ఉంటుంది గనుక ఆయనకు టికెట్ ఖరారు చేయవచ్చునేమో.

 

రాజకీయ పార్టీలన్నీఎన్నిసిద్దాంతాలు, ఆదర్శాలు వల్లెవేసినప్పటికీ స్థానిక కులసమీకరణాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలలో అడుగు ముందుకు వేయలేవని స్పష్టమవుతోంది.