TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింహంతో సెల్ఫీ... చిక్కుల్లో జడేజా!

Published on: Fri Jun 17, 2016 3:44PM

సెల్ఫీ అన్న మాట ఇప్పుడు ఇంటింటి పదంగా మారిపోయింది. వీలైనంత కొత్తగానో, చెత్తగానో సెల్ఫీని దిగేసి పదిమంది దృష్టిలోనూ పడిపోవాలన్న ప్రలోభం పెరిగిపోయింది. కానీ ఆ ప్రలోభం మాటున పొంచి ఉన్న ప్రమాదమే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు భారతీయ క్రికెటర్‌ రవీంద్ర జడేజా దిగిని సెల్ఫీ కూడా వివాదాలకు కేంద్రంగా మారింది. ఏడాది పొడవునా క్రికెట్‌ ఆడీ ఆడీ అలసిపోయిన రవీంద్ర జడేజాను కాస్త సెలవు తీసుకోమంటూ బోర్డు అధికారులు ఈ మధ్యనే సూచించారు. అందుకోసం జింబాంబ్వేలో జరుగుతున్న సిరీస్‌ నుంచి కూడా తప్పించారు. దొరికిందే సందుగా జడేజా తన భార్యతో కలిసి గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కులో చక్కెర్లు కొట్టాడు.

 

అంతదాకా బాగానే ఉంది కానీ, గిర్‌కే తలమానికమైన ఏషియాటిక్ సింహాలకి అతి సమీపంలో నిల్చొని ఎడాపెడా సెల్ఫీలు దిగేయడమే వివాదంగా మారింది. జడేజా, భార్యాసమేతంగా దిగిన ఈ సెల్ఫీలని చూసి అటవీ శాఖ ఉన్నతాధికారులు సంతోషించలేదు సరికదా... దర్యాప్తుకి ఆదేశించారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన సింహాలని వాహనంలోంచి చూడాలే కానీ, కిందకి దిగడం నేరం. అలాంటి సమయంలో జరగరానిది ఏదన్నా జరిగి ఉంటే, సింహాలను కాల్చి పారేయాల్సి వచ్చేది. లేదా జడేజా అన్నా వాటి పంజాకు బలయ్యేవాడు. ఎందుకంటే అది సెల్ఫీ అన్న విషయం సింహాలకు తెలియదు కదా! అటవీ శాఖ అధికారుల దర్యాప్తులో జడేజా తప్పు ఉందని తేలితే కనుక, అతను చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదు.