ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ మృతి
Published on: Wed Jan 6, 2021 10:02AM
కరోనా మహమ్మారి నుండి తమ దేశ పౌరులను రక్షించుకునేందుకు అమెరికా, బ్రిటన్ వంటి కొన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చాయి. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొంత మంది హెల్త్ వర్కర్లకు సైడ్ ఎఫెక్ట్స్ బయట పడ్డాయి. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ ఒకరు మృతి చెందారు. పోర్చుగల్ దేశంలో న్యూ ఇయర్ రోజున ఆ ఘటన జరిగింది. సోనియా అసెవెడో (41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ మొదటి షాట్ తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లోనే ఆమె మృతి చెందింది.
అసెవెడో మృతిపై ఆమె కుమార్తె వనియా ఫిగరెడో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో తనకు కొంత అసౌకర్యంగా ఉందని తన తల్లి తనతో చెప్పిందని పేర్కొన్నారు. మిగిలినదంతా బాగానే ఉందని ఆమె చెప్పారన్నారు. అంతేకాకుండా ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాధితురాలి తండ్రి అబిలో అసెవెడో ఒక పోర్చుగీస్ డైలీతో మాట్లాడుతూ చెప్పారు. ఆమెకు కరోనా లక్షణాలు కూడా లేనప్పటికీ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, తన కుమార్తె అసలు ఎలా చనిపోయిందో తనకు తెలియాలని అయన కోరుతున్నారు.
గత సంవత్సరం డిసెంబరు 30న ఆమె ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెలో ఎటువంటి అవాంఛనీయ ప్రభావం కనిపించలేదని పేర్కొన్నాయి. అసెవెడో ఆకస్మిక మరణం తమను కలచివేసిందని, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ తెలిపింది. ఫైజర్, బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను తీసుకున్న538 మంది ఆరోగ్య కార్యకర్తల్లో అసెవెడో ఒకరు. ఇది ఇలా ఉండగా పది మిలియన్ల మంది జనాభా ఉన్న పోర్చుగల్ దేశంలో 4.27 లక్షల మంది కరోనా బారినపడగా, 7,118 మంది మృత్యువాత పడ్డారు.


