కేసీఆర్ ప్రభుత్వం @ 45.. అభివృద్ధి @ 0: పొన్నం

 

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు పూర్తయింది. ఇంతవరకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారుగానీ, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన అక్కడితో ఆగకుండా కేసీఆర్‌ని మాయల మరాఠీ అని సంబోధించారు. ఎన్నికల హామీలపై అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ వట్టి మాటల్ని కట్టిపెట్టి తెలంగాణ ప్రజలకు గట్టిమేల్ తలపెట్టే పనులు చేయాలని సూచించారు. ఇవన్నీ కేసీఆర్‌కి పొన్నం రాసిన బహిరంగ లేఖలో వున్నాయి. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికే నెలరోజులు సరిపోతుందన్న కేసీఆర్‌ మాటలు సరికావని పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు. రుణ మాఫీపై రోజుకో మెలిక పెడుతూ జాప్యం చేయడం సరికాదని, వర్షాభావానికి తోడు రుణాలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పొన్నం తన లేఖలో పేర్కొన్నారు.