పొన్నాలకి క్లియర్..మర్రికి షాక్‌.. జానాకు సస్పెన్స్‌

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమితో ఒక్కటయ్యాయిగాని సీట్ల సర్దుబాటు కోసం చాలా కాలం మదన పడ్డాయి. ఎట్టకేలకు టీడీపీ 14 ,టీజేఎస్ 8, సీపీఐ 3 , మిగలిన  స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడే అసలు తలనొప్పి మొదలైంది.సీట్లు సరే ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే దానిపై తర్జన భర్జన పడ్డాయి. నామినేషన్ వేసేందుకు ఇతర పార్టీలు సిద్ధమవుతున్నా కూటమి పార్టీల్లో సమన్వయము కుదర్లేదు.కూటమి విచ్చిన్నం అవుతుంది అనుకున్న తరుణంలో పలు చర్చల అనంతరం మొత్తానికి పార్టీలు తమ తొలి విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాతో కొందరు సీనియర్ నేతలు అవాక్కయ్యారు. తమ పేర్లు లేకపోవటంతో షాక్ కి గురయ్యారు. జాబితాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు లేవు.

పొన్నాల లక్ష్మయ్య తాను మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ స్తానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ తన పేరు లేదు.ఆ స్థానాన్ని పొత్తు భాగంగా టీజేఎస్ కి కేటాయిస్తున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పొన్నాల హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో చర్చలు జరిపారు.ఎంపీ టికెట్ ఇస్తామన్నా వద్దని జనగామ టికెట్ కోసం పట్టుబట్టారు. బీసీ నేత అందులోనూ,సీనియర్ నేత అవ్వటంతో ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని భావించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనగామ స్థానం విషయంలో రాజీ పడాల్సిందిగా కోదండరాంని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కోదండరాం భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఎట్టకేలకు కోదండరాం ఆ స్థానం విషయంలో తగ్గారు.దీంతో పొన్నాల కి లైన్ క్లియర్ అయింది.

మర్రి శశిధర్ రెడ్డి ..మాజీ ముఖ్య మంత్రి కుమారుడు,న్యాయపోరాటాలతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన నాయకుడు.ఇలాంటి నేతకి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది.ఆయన పేరు కూడా రెండు జాబితాల్లో ప్రకటించలేదు.పైగా ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీ కి కేటాయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దీంతో ఆయన డిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు.సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారనుకుంటే అది జరగలేదు. కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైన కాసేపటికే సనత్‌నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.దీనిపై స్పందించిన మర్రి శశిధర్‌రెడ్డి మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. నియోజకవర్గంలో తన కమిట్‌మెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఓ నిర్ణయానికొస్తానని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారిన ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మిర్యాలగూడ విషయంలో కూడా సందిగ్దత వీడలేదు.మిర్యాలగూడ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఆయన కుమారున్నిబరిలో దింపాలని భావిస్తున్నారు.పొత్తులో భాగంగా ఆ స్థాన్నాన్ని టీజేఎస్ ఆశిస్తుంది.దీనిపై స్పష్టత రాకపోవటంతో ఆ స్థానాన్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేశారు.కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని తేల్చేసిందట.ఇప్పటికే పొన్నాల కోసం జనగామ స్థానాన్ని త్యాగం చేసిన కోదండరాం మరో స్థానాన్ని వదులుకోడానికి సిద్ధంగాలేరని సమాచారం.దీంతో జానా రెడ్డి తన కుమారునికి టికెట్ ఇవ్వకున్నా పర్లేదు కానీ టీజేఎస్ లో తాను సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నారట. జేఏసీ లో కీలక భూమిక పోషించిన టీజేఎస్ నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ ఇవ్వాలని కోదండరాం భావిస్తుంటే టీజేఎస్ లోనే ఉన్న తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి పట్టుబడుతున్నారట.మరీ ఈ ఇరకాటంలో ఆ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.