TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసంతృప్తి వర్గంలోకి పొన్నాల జంప్?

Published on: Sun Mar 1, 2015 10:00AM

 

అధికారంలో ఉన్నా లేకున్నా పదవుల కోసం కీచులాడుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటే. పొన్నాల లక్ష్మయ్యని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు నియమించిన మరునాటి నుండే ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసి పార్టీని గెలిపించుకొనే ప్రయత్నం చేయకుండా పొన్నాలను ఆ కుర్చీలో దింపేందుకే చాలా అంకితభావంతో పనిచేసారు. ఎట్టకేలకు వారి సమిష్టి కృషి ఫలించింది. పొన్నాలను కుర్చీలో నుండి దింపేసి అందులో హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టేందుకు రంగం సిద్దమవుతోంది.

 

ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు తెలిసి మళ్ళీ షరా మామూలుగానే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో బాటు మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు అప్పుడే ఆయనపి కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలకు తమ పార్టీ భవిష్యత్ గురించి ఆలోచించే తీరిక లేకపోయినప్పటికీ, ఇటువంటి కుమ్ములాటలకు మాత్రం అందరూ తీరిక చేసుకోవడం విశేషమే. అందువల్ల కొత్తగా ఎన్నికయిన అధ్యక్షుడు కూడా పార్టీ భవిష్యత్ కంటే ముందు తనను వ్యతిరేకిస్తున్న వారినందరినీ సముదాయించుకొంటూ, వారి నుండి తన కుర్చీకి ఎటువంటి ముప్పు కలగకుండా కాపాడకుండా చూసుకోవడానికే తన సమయం వెచ్చించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అంటే మరి అలాగే నడుస్తుంది. నడవాలి కూడా. అప్పుడే అది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు కూడా తేలికగా గుర్తించగలుగుతారు.