TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ క్రెడిట్ కూడా మాదే! పొన్నాల

Published on: Thu Sep 25, 2014 3:46PM

 

ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లున్నాయి తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాటలు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ పార్టీని ఎన్నికలలో గెలిపించుకోలేక చతికిలబడిన అయన, మార్స్ ఉపగ్రహం విజయం తమ పార్టీకే చెందుతుందని నిన్న ప్రకటించేసుకొన్నారు. మార్స్ మిషన్ విజయవంతం అవడంతో నిన్న హైదరాబాదులో పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన “ఇంత గొప్ప విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను. ఈ ఖ్యాతి మా యూపీఏ ప్రభుత్వానికి దానిని నడిపిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగుకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన హయాంలోనే ఈ మార్స్ మిషన్ ఆరంభించబడింది. అది నేటికీ విజయవంతంగా పూర్తవడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని అన్నారు.

 

ఆయన మాటలను కాదనడానికి ఏమీ లేదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రయోగంలో చివరి దశను స్వయంగా చూసేందుకు ఇస్రోకి వెళ్ళడం, అక్కడ శాస్త్రవేత్తలను అభినందించడం వారు ఆయనను అభినందించడం, ఈ క్యాతి యావత్ భారతదేశానికి చెందుతుందని మోడీ ప్రకటించడం చూసి, పొన్నాల అందులో తమ హస్తం కూడా ఉందని ప్రకటించుకొన్నారు.

 

అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే డా. మన్మోహన్ సింగు పేరుకి ప్రధానమంత్రి అయినప్పటికీ గత పదేళ్ళ యూపీఏ పాలనలో కాంగ్రెస్ నేతలు అందరూ సోనియా గాంధీ చుట్టూ ఉపగ్రహాలలాగా ప్రదక్షిణాలు చేసేవారు తప్ప ఏనాడూ ఆయనను పట్టించుకొన్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పొన్నాల పొరపాటున సోనియాకు బదులు ఆ ఖ్యాతిని ఆయనకు ఆపాదించేసినట్లుంది. ఈ విషయమై ఎవరో ఒకరు సోనియమ్మ చెవిలో వేస్తే ఇప్పటికే ఊగిసలాడుతున్న ఆయన పీసీసీ కుర్చీలో నుండి క్రింద పడిపోయే ప్రమాదం ఉంది.