జగన్ అక్రమాస్తుల కేసులో పొన్నాల లక్ష్మయ్యకు సిబిఐ నోటీసు
Published on: Tue Jun 5, 2012 9:23AM
వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు, ఈనెల 7న విచారణకు హాజరు కావాలని సిబిఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్ కంపెనీకి వైయస్ రాజశేఖర ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా భారీగా నీటి కేటాయింపులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వైయస్ మంత్రివర్గంలో పొన్నాల భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జారీ చేసిన పలు జీవోలపై సిబిఐ ప్రశ్నించనుంది. అప్పట్లో భారీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్, మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ జీవోలు జారీ చేశారు. ఆదిత్యనాథ్‌ను నెలరోజుల కిందటే సీబీఐ అధికారులు పిలిచి ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రి పొన్నాలకూ పిలుపు అందింది. దీంతో సీబీఐ విచారణ ఎదుర్కొన్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావుల సరసన పొన్నాల పేరు చేరనుంది.


