పొన్నాల కుర్చీ క్రింద మంటలు

 

తంతే బూర్లె గంపలో పడినట్లు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణా పీసీసీ అధ్యక్ష కుర్చీలో పడిన పొన్నాల లక్ష్మయ్యకు అప్పుడే అసమ్మతి మొదలయింది. ఆ కుర్చీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొన్న జానారెడ్డి, దామోదర, డీ.శ్రీనివాస్, షబ్బీర్ ఆలీ తదితరులు, ఆయన పార్టీని సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారని అధిష్టానానికి పిర్యాదులు చేయడంతో, పొన్నాలను వెంటనే డిల్లీ వచ్చి తనను కలవమంటూ దిగ్విజయ్ సింగ్ నుండి సమన్లు జారీ అయిపోయాయి.

 

ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టి పదిరోజులయినా ఇంతవరకు టీ-కాంగ్రెస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయలేదని, పార్టీ నేతలను కలుపుకు పోయేందుకు అసలు శ్రద్ధ చూపడం లేదని, తెరాసను డ్డీకొనడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆయనపై డిల్లీకి పిర్యాదులు వెలువెత్తాయి. పైగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేస్తూ పార్టీని బలపరుస్తుంటే, పొన్నాల పార్టీని బలోపేతం చేసేందుకు ఏమాత్రం కృషి చేయకుండా తనకి, తన అనుచరులకు పార్టీ టికెట్స్ దక్కించుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినపటికీ దానిని గట్టిగా ప్రచారం చేసుకోవడంలో విఫలమయిన టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస ఆ క్రెడిట్ ని స్వంతం చేసుకొంటూ గట్టిగా ప్రచారం చేసుకొంటుంటే, తెరాసను గట్టిగా ఎదురించకపోగా, పొన్నాలపై యుద్ధం ప్రకటించడం విశేషం. ఊహించని విధంగా పీసీసీ అధ్యక్ష కుర్చీ దక్కిందని సంతోషిస్తున్న పొన్నాలకు ఊహించని విధంగానే తన కుర్చీ క్రింద పొగలు, మంటలు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతూ కాపాడమని డిల్లీకి పరిగెత్తారు.