TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కమల దళంలోకి పొంగులేటి?

Published on: Thu Aug 18, 2022 4:38PM

తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్‌ని కాషాయ దళం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు 21న మునుగోడు సభ వేదికగా కొందరు టీఆర్ఎస్ కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణా కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకి  హాజరు అవుతున్నారు. అమిత్ షా కి ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు సర్వం సన్నద్ధంగా ఉన్నారు.  

హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అదే సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారని ఇప్పటికే ప్రకటించారు. అలాగే టి.ఆర్.ఎస్   నుండి కమలం కండువా కప్పుకునే నేతలలో  ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీలో పొంగులేటి చేరిక ఖాయమైందని మునుగోడు సభలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. బుధవారం (ఆగస్టు 17) జరిగిన తన కుమార్తె  నిశ్చితార్థం రిసెప్షన్తో  దీనిపై మరింత స్పష్టత వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె  నిశ్చితార్థ  వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఐతే ఇంత ఘనంగా నిర్వహించిన వేడుకలో అధికార టీఆర్ఎస్  నేతలెవరూ కనిపించలేదు.  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి  షర్మిల సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.  ఈ వేడుకలో ఈటల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సొంత పార్టీ నేతలెవరూ హాజరకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పొంగులేటి బీజేపీలోకి వెళ్లనున్నారని అందువల్ల గులాబీ నేతలు హాజరు కాలేదని తెలుస్తోంది. పొంగులేటి తన బలం చుపించుకోవడానికే లక్షలాది మందిని ఆహ్వానించారని తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా అమిత్ షా సమక్షంలో కమలదళంలో చేరే అవకాశముందని సమాచారం.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.