ఖమ్మం ఎంపీగా కేసీఆరా? రాహుల్ గాంధీనా?

 

తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఖమ్మం గురించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల దృష్టి ఖమ్మం ఎంపీ స్థానం మీద పడింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖమ్మం ఎంపీ బరిలోకి దిగాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఏ ఒక్కరు ఖమ్మం నుంచి పోటీ చేసినా సంచలనం అవ్వడం ఖాయం.

ఈమధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. అయితే ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ కు చేదు ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో బలంగా ఉన్న టీఆర్ఎస్.. ఖమ్మంలో మాత్రం ఆశించిన స్థాయిలో బలపడలేదు. అందుకే టీఆర్ఎస్ ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మంలో గులాబీ జెండా ఎగిరేలా చేయాలి అనుకుంటుంది. దానికి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలే కరెక్ట్ టైం అని భావిస్తోంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం ఎంపీ సీటు గెలుపు కోసం కసరత్తులు మొదలుపెట్టారు. అయితే కొందరు టీఆర్ఎస్ నేతలు అధిష్టానం దృష్టికి ఒక ఆసక్తికరమైన అంశం తీసుకెళ్లారట. అదేంటంటే కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలి. కేసీఆర్ పోటీ చేయడం వల్ల ఎంపీ సీటు ఈజీగా గెలవడంతో పాటు.. జిల్లాలో పార్టీ బలపడుతుందని సూచించారట. దీంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇచ్చి..  తాను ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరి ప్రస్తుతం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న కేసీఆర్.. ఖమ్మం నుంచి వేరొకరితో పోటీ చేయించి రిస్క్ చేసే కంటే.. తానే పోటీ చేస్తే ఖచ్చితంగా ఖమ్మం సీటు తమ ఖాతాలో పడుతుందని భావించి బరిలోకి దిగుతారేమో చూడాలి.

టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు చెప్పినట్లుగానే.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారట. రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్ సభ ఎన్నికల కసరత్తు గురించి చర్చించారు. ఈ సందర్భంగా.. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి.. రాహుల్ ని కోరారు. గతంలో ఇందిరా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనికి రాహుల్ నవ్వుతూ.. చూద్దాం లే అని సమాధానం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల కూటమి ఖమ్మంలో సత్తా చాటింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే ఎంపీ సీటు గెలిచే అవకాశముంది. అయితే అభ్యర్థి ఎవరనేది అసలు సమస్య. గతంలో టీడీపీ తరపున ఎంపీగా పనిచేసిన నామా నాగేశ్వరరావు.. మొన్న ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి ముందుగా వినిపించే పేరు రేణుక చౌదరి. సీనియర్ నేత, గతంలో ఎంపీగా పనిచేసారు. అయితే ఇప్పుడున్న వర్గపోరులో ఆమెకి మిగతా నేతలు సహకరించడం కష్టమే. అందుకే సుధాకర్ రెడ్డి వంటి నేతలు రాహుల్ ని పోటీ చేయమని కోరుంటారు. అయితే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన యూపీలోని అమేథీ నుంచి పోటీ చేస్తుంటారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.