మోదీతో భేటీ.. బీజేపీ గూటికి పొంగులేటి

 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆయన పంపించారు. కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సుధాకర్‌రెడ్డి.. పార్టీలో ఇమడలేక, జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్‌ పెద్దలు పట్టించుకోవటం లేదన్న మనస్తాపంతో ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీకి రాజీనామా చేసిన సుధాకర్‌రెడ్డి వెనువెంటనే ప్రధాని మోదీని కలిసి సుమారు అరగంట సేపు సమావేశమయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన సుధాకరెడ్డి.. 2008నుంచి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ నెలలో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటు టీడీపీకి వెళ్ళింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆ టికెట్ ను కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి కేటాయించింది. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. టికెట్ రాకపోవడం, పార్టీలో గుర్తింపు రోజురోజుకి తగ్గుతుండడం, ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుండడం, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ఈ పరిణామాల నేపథ్యంలో సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీ గూటికి చేరారు.