ఖమ్మం టీఆర్‌ఎస్‌లో ముసలం.. పొంగులేటి తీరుతో కారుకి కొత్త కష్టం!!
Published on: Tue Jan 19, 2021 3:24PM
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో నిరాశలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కి మరో షాక్ తగలనుందా?.. త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వేళ పార్టీలో ఏర్పడిన ముసలం టీఆర్ఎస్ కి మరో ఓటమిని తెచ్చిపెట్టనుందా?.. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిన్నాయి. సౌమ్యుడుగా పేరున్న పొంగులేటి ఉన్నట్టుండి ఫైర్ అయ్యారు. సిట్టింగ్ ఎంపీ అయిన తనని కాదని గత ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చినా నోరు మెదపని పొంగులేటి.. ఉన్నట్టుండి తన అనుచరుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ సొంత పార్టీ నేతలను హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది.
తన అనుచరులను ఆయా నియెజకవర్గాలలోని ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారని పొంగులేటి ఆరోపిస్తున్నారు. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన ఆయన.. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదని, కక్షపూరిత రాజకీయాలు వద్దని అన్నారు. తన అనుచరులను కష్టపెట్టిన వారు వడ్డీతో సహ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ పదవి లేని పొంగులేటి.. నియెజకవర్గాలలో పర్యటించడంపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న వార్తలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తాను ప్రజా ప్రతినిధిని కానని.. ఎవరి అనుమతి తీసుకుని పర్యటనలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాభిమానమే తనకు పదవని.. వచ్చే రోజున ఏదీ ఆగదని, పోయేది చెప్పి పోదని వ్యాఖ్యానించారు. తన అభిమానులను వేధించే ఎవరైనా ప్రతిఫలం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.
సొంత పార్టీ నేతలను హెచ్చరిస్తూ పొంగులేటి వ్యాఖ్యలు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ఆయన ఇంత ఆవేశపడటానికి కారణమేంటి? ఆయన పార్టీ మారడానికి సిద్దమయ్యారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆయన టీఆర్ఎస్ ను వీడతారని గత లోక్ సభ ఎన్నికల నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనకు చెందిన సంస్థ పెద్ద ఎత్తున ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం, ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఆయన పార్టీ మారలేదని అంటుంటారు. అలాగే సీఎం కేసీఆర్ ఆయనకు రాజ్యసభ హామీ ఇచ్చారని కూడా ప్రచారముంది. అయితే ఇప్పుడు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ దూకుడు పెంచడం.. మరోవైపు, జిల్లాలో తనకి పట్టున్నప్పటికీ పదవిలో లేకపోవడం, సొంత పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో ఆయన ఇక టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉన్నట్టుండి ఆయన దూకుడు పెంచి సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వేళ పొంగులేటి తీరు టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలున్నాయి. ఆ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు గాను ఒక్క సీటుతో టీఆర్ఎస్ సరిపెట్టుకుంది. ఆ కారణంతోనే సిట్టింగ్ ఎంపీ అయిన పొంగులేటి టికెట్ ఇవ్వకుండా.. నామాకి టికెట్ ఇచ్చారు. ఆ టైములో పొంగులేటి బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి మాత్రం నామా గెలుపుకోసం కృషి చేసి టీఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి స్వరం పెంచడం.. జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే టీఆర్ఎస్ కు మరో దెబ్బ తగిలినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.


