ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకు ఓటడిగారా?
Published on: Wed Jun 13, 2012 10:27AM
తాము చేస్తున్న ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి కొందరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. అదీ ఎన్నికల సమయంలోనే. దీన్ని వెబ్ కెమెరాల్లో గుర్తించి ఈసి వారిపై కొరడా ఝుళిపించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ పివిఆర్ స్కూల్ 60వ నెంబరు పోలింగ్ బూత్ లో ప్రిసైడింగ్ అధికారి వి.శేషగిరి, మైక్రో అబ్జర్వర్ ఎన్. శేషగిరి ఓటర్లను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరుతూ వెబ్ కెమెరాలో ఈసీకి దొరికిపోయారు. వీరిద్దరినీ విధులనుంచి తప్పించారు. అలానే జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనిత రాజేంద్ర వీరిద్దరినీ అరెస్టు చేయించారు. అనంతపురం విద్యారణ్య ఓరియంటల్ ఎయిడెడ్ ఉన్నతపాఠశాల పోలింగ్ బూత్ నెంబర్ 69లో బి.ఎల్.ఓ. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తుండగా జోనల్ అధికారి ఆమెను విధులనుంచి తప్పించి ఉన్నతాధికార్లకు విషయాన్ని చేరవేశారు. అలానే చెమకూరు మండలం కోర్నేపాడులో పోలింగ్ బూత్ లో మొత్తం ఎన్నికల సిబ్బంది, పోలీసులు కలిసికట్టుగా ఓటర్లను వదలకుండా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఒటేయించారు. దీంతో ఓటర్లు పోలింగ్ ను ఆపుచ్జేయించారు. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వచ్చి నచ్చచెప్పడంతో మళ్ళీ పోలింగ్ రెండు గంటల తరువాత ప్రారంభమైంది. జగన్ పార్టీ నేతలు తమ అనుచరులతో వచ్చి కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ను అడ్డగించారు. ఒంగోలు సెయింట్ జేవియర్స్ పోలింగ్ బూత్ లో జగన్ పార్టీ నేతలు పోలింగ్ ను అడ్డుకున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన అనుచరులతో వచ్చి పోలింగ్ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు నేరానికి పాల్పడిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారెడ్డి, జానకీరామయ్యలను కడపజిల్లా సిద్ధవటం మండలం మాధవపురంలో అరెస్టు చేశారు.


