ప్రత్యేక అజెండాతో ధర్మాన.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెనుమార్పు రానుందా?

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం పీఠంపై కూర్చున్న వైఎస్ జగన్ కి ఒక్క ఏడాదిలోనే తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ అధినేతగా, సీఎం గా రెండు కీలక బాధ్యతల్లో ఉన్న జగన్ కి సొంత పార్టీ నాయకుల ధిక్కార వ్యాఖ్యలు కొంత తలనొప్పిగా మారాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఇది ఇలా ఉండగానే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ధిక్కార స్వరం పెంచుతున్నారు. వీళ్ళను కట్టడి చేయడం జగన్ కి ఇప్పుడు కీలక పనిగా మారింది.

వైసీపీలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడు. ఆయన రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పట్టున్న నేత. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనకు మంత్రి పదవి పక్కా అనుకున్నారు. కానీ ఆయన సోదరుడైన కృష్ణదాస్ కి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో, జిల్లాలో ప్రసాదరావు మాట సాగడం లేదు. చిన్న చిన్న పనుల నుంచి ఇసుక వ్యవహారం వరకు ఏ విషయంలో కూడా ఈయన మాట నెగ్గడం లేదు. అందుకే ఈ మధ్య ఆయన ధిక్కార స్వరం పెంచారు. 

తాజాగా "రాష్ట్రంలో జిల్లాలు విభజించుకుంటే చేసుకోండి. శ్రీకాకుళం జిల్లాను మాత్రం విభజించవద్దు. ఇది మాది, మా ప్రజలు అంగీకరించరు. మా జిల్లా ఇలాగే ఉండాలి, సీఎం జగన్ కి మేము ఇదే చెప్తాము. మిగిలిన 12 జిల్లాలను ఏమైనా చేసుకోండి, కానీ మా జిల్లాని వదిలేయండి" అన్నారు. మా ప్రాంతం, మా ప్రజలు అనే భావన వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే, గత నెల కూడా ఆయన ప్రభుత్వంలో పాలన అనుకున్నంత సవ్యంగా లేదని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వని కారణంగానే ధర్మాన ఇలా మాట్లాడుతున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి.

అయితే, ధర్మాన ప్రసాదరావు భవిష్యత్తులో ఓ ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం లో ఉత్తరాంధ్ర సాధన సమితి సమావేశం జరిగింది. దీనిలో ధర్మాన అనుచరగణం అందరూ పాల్గొన్నారు. దీనికి ధర్మాన పరోక్షంగా పూర్తి మద్దతు పలికారు. దీంతో, ధర్మాన 'ప్రత్యేక ఉత్తరాంధ్ర' అనే ఉద్యమానికి ప్రణాళికలు వేశారని, వచ్చే ఎన్నికలకు ఆయన సొంతంగా ఇదే అజెండాతో వెళ్తారని శ్రీకాకుళంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ తనకి పార్టీలో అనుకున్న హోదా దక్కకపోతే, జగన్ నుండి ఇదే తరహా ట్రీట్మెంట్ ఎదురైతే మాత్రం.. వచ్చే ఎన్నికల నాటికి ధర్మాన వైసీపీ తరఫున పోటీ విషయంలో పునరాలోచనలో పడతారని, కొన్ని అజెండాల ఆధారంగా వెళ్తారని అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా మంచి వాగ్ధాటి, వ్యూహాలు ఉన్న ధర్మాన ఇప్పుడు అన్న కృష్ణదాస్ పెత్తనంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ మంత్రిగా గతంలో ఎన్నో ఏళ్ళు జిల్లాలో చక్రం తిప్పిన ఈయనకు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉండడం ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారని అంటున్నారు. మరి భవిష్యత్ లో ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.