చంద్రబాబును ఖాళీ చేయిస్తాం: ఆర్కే

 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణంలోనేనని ఆరోపించారు. చంద్రబాబును ఆ నివాసం నుంచి ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారు ఆర్కే. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలపై కోర్టులో పోరాటం కొనసాగుతుందన్నారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని, మరి చంద్రబాబు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు? అని ప్రశ్నించారు ఆర్కే.

రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదన్నారు ఆర్కే. పనులు ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాలన్నారు. కాంట్రాక్టర్లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సీఆర్డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారన్న ఆర్కే, ఆ పోస్ట్  తనకు ఇస్తున్నారన్న విషయం తెలియదన్నారు.