కర్నాటక రాజకీయంలో మళ్లీ ముసలం
Published on: Mon Mar 19, 2012 1:19PM
బెంగ
ళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కారణంగా కర్నాటక రాజకీయంలో మళ్లీ ముసలం మొదలైంది. బెంగళూరు శివార్లలోని ఓ రిసార్టులో యడ్యురప్ప తన మద్దతుదారులైన యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ వేశారు. మరో పది మంది పార్లమెంటు సభ్యులు యెడ్డీకి మద్దతు పలికారు. యెడ్డీ రాజీనామా చేయకపోతే తాము రాజీనామా చేస్తామని వారు అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు యడ్యూరప్ప కూడా పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. పార్టీ వెంటనే శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తనకు అధిష్టానంతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి సదానంద గౌడ పైనా యడ్డీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు డెబ్బై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పారు. కాగా నాగపూర్ రావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పంపిన ఆహ్వానాన్ని యడ్యూరప్ప తిరస్కరించారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సోమవారం రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలందరూ సమావేశమై మరోమారు హెచ్చరిక పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సాయంత్రానికే యడ్యూరప్పకు అనుకూలంగా ప్రకటన చేయాలని వారు అధిష్టాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


