రోడ్డునపడ్డ రాజకీయం..తలపడుతున్న టీడీపీ,టీఆఆర్ఎస్
Published on: Sat Feb 11, 2012 8:41AM
హైదరా
బాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. రాజకీయ నాయకులు రాష్ట్రంలో బూతు పురాణానికి తెరతీశారు. నోటికి అడ్డూఅదుపూ లేకుండా.. మంచిమర్యాదా లేకుండా ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటున్నారు. స్థాయి మరచి.. సభ్యతా సంస్కారాలను విడిచి ఒకరినొకరు కసితీరా దూషించుకుంటున్నారు. నాలుకలు కోస్తామంటూ అవే నాలుకలతో నోటికి వచ్చినట్లు పరస్పరం తిట్టుకుని నోటి తీట తీర్చుకుంటున్నారు. నువ్వు చేసిన పాపాలు గంగా నదిలో మునిగినా.. పన్నీరుతో కడిగినా పోవు. నికృష్టమైన నాయకుడివి. విద్రోహంలో హీనమైన గతం నీది. వంచనలో అతి నికృష్టుడివి. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మనుషులను మాయం చేసిన మాయావివి. నీ బతుకే కుట్రలమయం'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఘాటు విమర్శలపై.. టీడీపీ నేతలు అంతే ఘాటుగా స్పందించారు. "నీ నాలుకనూ, నిన్నూ రెండుగా చీలిస్తే తప్ప.. నీకు బుద్ధి రాదు'' అంటూ కేసీఆర్‌పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. కెసిఆర్ తాగుబోతు, తిరుగుబోతు, దోపిడీదారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్‌ను నిలువునా చీలుస్తామని హెచ్చరించారు. పాసుపోర్టు నుండి పోలవరం దాకా ఆయనది దొంగ బతుకు అన్నారు. తెలంగాణవాదాన్ని పోలవరంలో ముంచిన పాపాత్ముడు అని అన్నారు. సెంటిమెంటును అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు ఆయన గల్లీ గల్లీలో ముక్కు నేలకు రాయాలన్నారు. పోలవరం టెండర్ల కోసం అమ్ముడు పోయారని ఆరోపించారు. కేంద్రానికి అమ్ముడు పోయిన పగటి దొంగ అని అన్నారు. తెలంగాణవాదాన్ని వ్యాపారంగా మార్చిన ఘనత ఆయనదే అన్నారు. ఆయన అక్రమ సంపాదన ప్రజల ముందు పెడతామన్నారు.
"ఈ యుగానికే నరరూప రాక్షసుడివి. వసూల్ రాజావి. నీ కన్నా నీచ నికృష్ట కుసంస్కారపు నేత మరొకరు లేడు'' అంటూ కేసీఆర్‌పై తలసాని శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ప్రతి ఎలెక్షన్తో కలెక్షన్ చేసుకొనే వసూల్ రాజాగా కేసీఆర్ మారారన్నారు. 2009 ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకొంటే నీ పార్టీ కార్యాలయంలోనే కార్యకర్తలు ఉరికించి కొట్టలేదా? హైదరాబాద్ నుంచి మేడారం తిప్పికొడితే రెండు వందల కిలోమీటర్లు లేదు. అక్కడకూ హెలికాఫ్టర్ వేసుకొని వెళ్లివచ్చావు.
డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? సినిమా వాళ్లను మొదలుకొని వ్యాపారుల వరకూ అందరినీ బ్లాక్మెయిల్ చేసి కూడబెట్టావు. చివరకు ఉద్యోగుల సకల జనుల సమ్మెను సైతం అమ్ముకున్న ఘనత కేసీఆర్ అది దుయ్యబట్టారు. "తాగుబోతూ.. జాగ్రత్త. నీ నోటిని ఫినాయిల్‌తో శుద్ధి చేసుకో. నీది నోరు కాదు.. మూత్రశాల'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై దేవేందర్ గౌడ్ మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ అన్ పార్లమెంటరీ భాష ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. "పిచ్చి కుక్క కరిచినందునే కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు'' అని తీగల కృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల తిట్లుకు కేసీఆర్ కూడా దీటుగానే స్పందించారు. "మీదే కుటిల నీతి, నీచ, దుష్ట సంస్కృతి'' అంటూ మండిపడ్డారు. ఇక.. 'మీరేనా తిట్టుకొనేది.. మేం మాత్రం తక్కువ తిన్నామా?' అన్న రీతిలో కాంగ్రెస్ నేతలూ తిట్లపురాణంలో భాగస్వాములయ్యారు. "తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కుక్కవి కాబట్టి కుక్క బుద్ధులొచ్చాయి. కనీసం ఎలా మాట్లాడాలో నీకు తెలియడం లేదు'' అంటూ చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి నిప్పులు చెరిగారు. "చంద్రబాబు కారుకూతలు మానుకోకుంటే.. కుక్క నాలికను కోసినట్లు ఆయన నాలుక కోస్తాం. ఆయనను మించిన నక్క మరొకటి ఉండదు'' అని మండిపడ్డారు.


