కేశవరావుకు ఎసరు..చిరంజీవికి కొసరు...
Published on: Tue Jan 3, 2012 3:08PM
హైదరాబాద్: కొందరు రాజకీయనాయకులు ఉన్నత స్థానాలకు ఎలా ఎదుగుతారో చాలా మందికి అంతుపట్టదు. నిత్యం అసంతృప్తవాదిగా పేరు మోసిన సి.హనుమంతరావు, ఎప్పుడు ఏం మాట్లాడినా ఎవరికీ ఏం అర్ధం కానట్లు మాట్లాడే కే.కేశవరావు ఈ కోవకే చెందుతారు. మాజీ జర్నలిస్ట్ అయిన కేశవరావు ఇటీవల కేసీఆర్ తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొని, తరచు నోరుపారేసుకుని అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ లో నెంబర్-2 లాంటి వృద్ద బెంగాల్ బెబ్బులి ప్రణబ్ ముఖర్జీ కేశవరావు గావు కేకలు భరించలేక షటప్ అనడమే గాక అధినేత్రి సోనియాకు కూడా అతనిపై కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి కేశవరావు కంఠం మూగబోయింది. అయితే అధిష్టానం మాత్రం అంతటితో ఆగకుండా కేశవరావు స్థానంలో చిరంజీవిని ఉంచి గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే అధిష్టానం ప్రాపకంలో కాపు నాయకులైన డి.శ్రీనివాస్, వి.హన్మంతరావు, బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఈ జాబితాలో నిన్న మొన్నటి వరకూ కే.కే కూడా ఉన్నారు. తెలంగాణా ఉద్యమంతో పాటు ఆయన ప్రాపకం కూడా కరిగిపోయింది. ఇప్పుడు అతని స్థానంలో చిరంజీవిని చేర్చుకోవాలని అతనికి రాజ్యసభ సీటు కట్టబెట్టి వీలైతే స్వతంత్ర ప్రతిపత్తిగల సహాయమంత్రి పదవిని ఒకదాన్ని కట్టబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది.


