సెక్స్ కుంభకోణాల వలయంలో రాజకీయనేతలు
Published on: Thu Apr 26, 2012 12:10PM
సెక్స్ కుంభకోణాల వలయంలో చిక్కుకొని రాజకీయనాయకులు విలవిలలాడుతున్నారు. ఈ వలయంలో చిక్కుకొన్న నేతల జాబితాలో తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్ స్థాయి సంఘం చైర్మన్ అభిషేక సింఘ్వీ కూడా చేరారు. ఈయన ఒక మహిళా న్యాయవాదితో శృంతాగంలో వున్నట్టు ఒక మీడియాలో ప్రత్యేక కథనం ప్రసారం కావడంతో ఆయన తాను నిర్వహిస్తున్న అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నిత్యం విలేకరుల సమావేశం నిర్వహించే సంఘ్వీ ఈ సంఘటన తరువాత కనీసం విలేకరులకు ముఖం చూపించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు.
యూట్యూబ్ లో పెట్టిన సిడి, టెలివిజన్ ఛానల్ లో ప్రసారమైన దృశ్యాలన్నీ మార్ఫింగ్ చేసినవని చెబుతున్నప్పటికీ అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో స్వయంగా వివరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంద్ఫీ. అమెరికా వంటి పాశ్చాత్యదేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో సెక్స్ కుంభకోణాలు తక్కువే అయినప్పటికీ, ఏ దేశంలో అయినా సెక్స్ కుంభకోణంలో చిక్కుకొన్న నేతలు మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. సెక్స్ కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన నేతలు కొందరైతే వాటి కుటుంబ సభ్యుల సెక్స్ కుంభకోణం కారణంగా నష్టపోయిన నాయకులు మరికొంతమంది వున్నారు. భారతదేశ చరిత్రలో దళిత వర్గాల నుంచి బాబూ జగ్జీవన్ రామ్ తొలి ప్రధానమంత్రి పదవి స్వీకరిస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన కుమారుడు ఒక మహిళతో శృంగారం జరుపుతున్నట్టు ఒక మాసపత్రికలో వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కాలేకపోవడానికి ఇతరత్రా రాజకీయ కారణాలతో పాటు కుమారునిపై సెక్స్ పరంగా వచ్చిన ఆరోపణలు కూడా ఒక కారణంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతాపార్టీకి చెందిన ఇరువురు శాసన సభ్యులు సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడిన సంఘటనతో పాటు 2005 లో ఆర్.ఎస్.ఎస్. సీనియర్ నాయకుడు సంజయ్ జోషిపై వచ్చిన సెక్స్ పరమైన వార్తలు ఆర్.ఎస్.ఎస్.తో పాటు బిజెపి పరువు ప్రతిష్టలను కూడా మంటకలిపాయి.
1998లో నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు జె.బి.పట్నాయక్ తమను లైంగికంగా వేధించినట్లు ఇరువురు మహిళా ఉద్యోగినులు చేసిన ఆరోపణలు పట్నాయక్ వ్యక్తిగత జీవితంలో మాయనిమచ్చగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్.డి.తివారీ (86) 2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తూ రాజ్ భవన లోనే అనైతిక శృంగార కార్యంలో వుండగా తీసిన వీడియో టెలివిజన్ లో ప్రసారం కావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.


