హైకోర్టు తీర్పు పై హాట్ కామెంట్స్

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పు పై వివిధ పార్టీల నాయకులు స్పందించారు.

ఈ తీర్పు పై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పందిస్తూ ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని అయన హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అయన హెచ్చరించారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ తీర్పు పై వ్యాఖ్యానిస్తూ ఇది ముందుగా ఉహించిందేనన్నారు ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేయడాన్ని అయన స్వాగతించారు. తమిళనాడు హై కోర్ట్ కూడా 2006లో ఇలాంటి తీర్పే ఇచ్చిందని, రాజ్యాంగ బద్ద పదవుల పదవీ కాలాన్ని తగ్గించే ఆర్డినెన్సులు చెల్లవని స్వయంగా వైసీపీ ఎంపీ స్పష్టం చేసారు. కోర్ట్ లకు ఈ ఆర్డినెన్స్ ను కొట్టేయడం మినహా వేరే మార్గం లేదన్నారు ఇప్పటికైనా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు,సూచనలతో ఆడగు ముందుకు వేయాలని అన్నారు.

హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం జగన్ కి కొత్త కాదని, రోజు వారీ మొట్టికాయల్లో కేవలం ఇది ఒకటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కులాన్ని ఆపాదించడం దారుణమన్న ఆమె ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, జగన్ సర్కార్ చలించడం లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆమె అన్నారు.