2019 పొలిటికల్ రిపోర్ట్.. లీడర్ ఆఫ్ ది ఇయర్ ఏపీ సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 23 వ తేదీన వచ్చిన ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. గతంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా అసెంబ్లీలో వైసీపీ 86 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 151 సీట్లలో గెలిచి రికార్డు సృష్టించింది. పోలైన మొత్తం ఓట్లలో 49.9 శాతం సాధించింది. ఇక అధికారం కోల్పోయిన తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 30.96 శాతం ఓట్లతో ప్రతిపక్షస్థానంలో కూర్చవలసి వచ్చింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి, మొత్తం 25 స్థానాలకు గాను, 22 చోట్ల వైసిపి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 

ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న జగన్ కల 2019 లో నెరవేరింది. ఇందు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలవాలన్న తపనతో అంతకు రెండేళ్ల ముందే 2017 నవంబర్ 6 న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 3648 కిలోమీటర్ల పాద యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 9 వ తేదీ న ప్రజా సంకల్ప యాత్రను ముగించారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. చివరకు ఘన విజయాన్ని అందుకో గలిగారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30 వ తేదీ న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు, ప్రమాణ స్వీకారం రోజు ఆయన వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. జూన్ 8 వ తేదీ న సీఎం జగన్మోహనరెడ్డి సెక్రటేరియట్ లో తొలిసారి అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంతపురం, అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండవ సంతకం చేశారు. జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తూ మూడవ సంతకం చేశారు.

2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాటు పాలించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చంద్రబాబు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలేవి ఆయన్ను గట్టెక్కించలేక పోయాయి. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి కమ్యునిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరపున రాపాక వర ప్రసాద్ మాత్రమే గెలిచారు. జనసేన పార్టీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఈ సారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. 2014 లో టిడిపితో కలిసి నాలుగు సీట్లు గెలిచిన బీజేపీకి ఈ సారి ఒక్కటి కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు ఎంతో ప్రయత్నించింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. జనసేనతో కలిసి పోటీ చేసిన కమ్యునిస్టు పార్టీల పరిస్థితి కూడా అంతే. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత  టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యలు పార్టీ ఫిరాయించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోయారు. మెజారిటీ సభ్యులు అటు వెళ్లడంతో రాజ్యసభలో టిడిపికి ఒక సభ్యుడు మాత్రమే మిగిలారు. ఓవరాల్ గా ఈ ఏడాది ఎన్నికలు వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలన్నింటికీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.