విలీనం సంగతి తరువాత.. ముందు ఆ విభేదాలు చల్లార్చండి

 

సీఎల్పీ ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ కి లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విలీనం ఏమో కానీ కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరుతో నాయకుల మధ్య విభేదాలు తలెత్తున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించిన హర్షవర్ధన్ రెడ్డి.. తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. సీఎల్పీ ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసే ప్రక్రియలో హర్షవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు  ఘర్షణ చోటు చేసుకొంది. పెంట్లవెల్లి మండలంలో ఆరుగురు ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొంది. గెలిచిన ఎంపీటీసీల్లో ముగ్గురు హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు, ఇద్దరు జూపల్లి కృష్ణారావు వర్గీయులుగా ఉన్నారు. ఒక్క స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే తమ వర్గానికి చెందిన వారే ఎంపీపీగా ఎన్నిక కావాలని జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిలు పట్టుబట్టారు. ఈ విషయమై పెంట్లవెల్లి ఎండిఓ వద్ద జూపల్లి, హర్షవర్ధన్ వర్గీయులు బాహ బాహీకి దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.

ఈ వ్యవహారంతో.. 'విలీనం సంగతి సరే.. ముందు నేతలతో భారీగా నిండిపోయిన పార్టీలో విభేదాలు తలెత్తకుండా చూస్కోండి' అంటూ టీఆర్ఎస్ అధిష్టానం మీద ఛలోక్తులు వినిపిస్తున్నాయి.