రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి.. మాజీ సీఎం నల్లారి
Published on: Thu Jun 25, 2026 12:34PM
.webp)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలలో విలులు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో మారుతున్న పోకడలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. చట్టసభలు స్థాయికి తగ్గట్టుగా పని చేయడం లేదన్నారు. తిరుపతి జిల్లా పరిధిలోని చిన్నగొట్టిగల్లు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాజకీయ పరిణామాలు, సమాజంపై వాటి ప్రభావం అనే అంశాలపై ప్రసంగించారు. పూర్వ కాలంతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ రంగంలో నైతిక ప్రమాణాలు అత్యంత దారుణంగా దిగజారిపోతున్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు.
గతంలో చట్ట సభల్లో ప్రజా సంక్షేమం, విధానాల రూపకల్పనపై ఆదర్శవంతమైన చర్చలకు నిలయంగా ఉండేవన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు నిలయాలుగా మారాయన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికన సాగాల్సిన విమర్శలు, వ్యక్తిగత పగలు, ద్వేషాలను వెళ్లగక్కేలా మారిపోయాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం కంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే నేటి నాయకులకు ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.
వైద్యులు, న్యాయవాదులు వంటి ఇతర గౌరవప్రదమైన వృత్తులతో రాజకీయ రంగాన్ని పోలుస్తూ.. కోర్టుల్లో లేదా వృత్తిపరమైన వేదికలపై లాయర్లు, డాక్టర్లు ఒకరి వాదనలను ఒకరు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. బయటకు రాగానే పరస్పరం మర్యాద ఇచ్చుకుంటారని ఉదహరించారు. వారిలో కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలబడే వృత్తిపరమైన నైతికత కనిపిస్తుందని చెప్పారు. కానీ, రాజకీయాల్లో మాత్రం కనీస మర్యాదలు, నైతిక విలువలు కరువయ్యాయని దుయ్యబట్టారు.
డిజిటల్ మాధ్యమాల్లో పెరిగిపోతున్న అసభ్యతపై కూడా మాజీ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్ సంస్కృతిని, ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అసభ్య దూషణలు, వ్యక్తిత్వ హననం వంటి వికృత పోకడలు పెరిగిపోయాన్నారు.


