TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆవిర్భావ వేడుకల్లో రాజకీయ భేతాళం

Published on: Thu Jun 2, 2022 1:43PM

ఆరు పదులు పైబడిన తెలంగాణ ప్రజల కల సాకారమై ఎనిమిదేళ్ళు అయింది. ఎనిమిదేళ్ళ క్రితం, 2014 లో ఇదే రోజున (జూన్ 2)న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు తొమ్మిదవ వసంతంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్,  ప్రధాని నరేంద్ర మోడీ మొదలు అనేక మంది ప్రముఖులు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

అదే విధంగా, రాష్ట్రం నాలుగు చెరుగుల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. అయితే, ఈ వేడుకల్లో ఏదో వెలితి, ఏదో లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎనిమిదేళ్ళకు ముందుకనిపించిన ఉద్యమ స్పూర్తి పూర్తిగా లోపించింది. రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఉద్యమ స్పూర్తి ఎనిమిదేళ్ళలో పూర్తిగా ఆవిరై పోయిన వైనమే కనిపించింది.రాష్ట్రం రాజకీయ ఊబిలో కూరుకుపోయింది. అదే రాజకీయ  భేతాళం రాష్ట్ర అవతరణ వేడుకలను వెంటాడింది. ఎవరిదారిన వారు వేడుకలు జరుపుకున్నారు. చివరకు, రాజ్ భవన్’లో జరిగిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించనే లేదు. ఇక రాజకీయ పార్టీల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. రాజకీయ పార్టీలు ఎవరికి వారు వేడుకలు జరుపుకున్నారు. అదే సమయంలో, పరస్పర దూషణలతో రాజకీయ వికారాలు ప్రదర్శించారు. ఎవరికీ వారు నవ్వి పోదురు  గాక నాకేటి సిగ్గు అన్న విధంగా ప్రవర్తించారు. 

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఉత్సవాలు జరిపింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్’లో జరిగిన ప్రధాన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఈ ఎనిమి దేళ్ళలో రాష్ట్ర  సాధించిన ‘అద్భుత’ విజయాలను చక్కగా చెప్పు కొచ్చారు. అందులో సత్యాలున్నాయి. అసత్యాలు, అర్థ సత్యాలు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిజాన్ని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ఆర్థిక దుస్థితిని, ఈ రోజుకు కూడా రోజుకు ముగ్గురు వంతున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న చేదు  నిజాలను, కనీసం ప్రస్తావించలేదు. అంతే కాదు, ఎనిమిదేళ్ళ తర్వాత కూడా అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేరని నిజాన్ని, ప్రస్తావించలేదు. చివరకు, తొలి దశ (1969) ఉద్యమమంలో అశువులు బాసిన అమర వీరులకు, అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన, అమర వీరుల స్టూపమే, ఈనాటికీ మలి దశ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు ప్రతీకగా నిలించింది. మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది తెలంగాణ బిడ్డల గుర్తుగా స్మారక స్థూపం కూడా నిర్మాణం కాలేదనే నిజాన్ని, ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు.

ఉమ్మడి రాష్ట్ర  పాలకులు నిర్మించిన అమరవీరుల స్తూపం వద్దనే  ముఖ్యమంత్రి మలి దశ అమరవీరులకు నివాళులు అర్పించారు. నిజమే కావచ్చును, ముఖ్యమంత్రి చెప్పుకొచ్చిన గొప్పల జాబితాలో కొన్ని నిజం అయితే కావచ్చును, కానీ, ఎనిమిదేళ్ళలోనే ఉద్యమ స్పూర్తి అడుగంటి పోవడం, అమరవీరులను మరిచి పోవడం, ఒక పార్టీ, ఒక కుటుంబం ఆధిపత్యంలో తెలంగాణ భవిష్యత్ బందీ కావడం దేనికి సంకేతం. ఇప్పుడు ఇదే  ప్రశ్న తెలంగాణ ఉద్యనేతలనే కాదు సామాన్య ప్రజలను కూడా వెంటాడుతోంది. అన్నివర్గాలు, అందరు ప్రజలు కలిసి పోరాడి సాధిచుకున్న సామాజిక తెలంగాణ ఎనిమిదేళ్ళ స్వల్ప కాలంలో, రాజకీయ తెలంగాణగా అవతరించడం, ఉద్యమ విజయాలను మింగేసే చేదు నిజంగా తెర మీదకు వచ్చింది.

నిజమే ముఖ్యమంత్రి, కేసీఆర్, 2014లోనే తెరాస  ఇక ఏమాత్రం ఉద్యమ పార్టీ కాదని, ఫక్తు పదహాహరు అణాల రాజకీయ పార్టీ అని తెగేసి చెప్పారు. తెరాస నడక ఆ తీరుగానే సాగుతోంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతోంది. అందుకే, ఇప్పుడు, అమరవీరుల ఆత్మశాంతి కోసం మరో తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకోవలసిన సమయం అసన్నమైందనే మాట విపిపిస్తోంది.