కేసీఆర్‌తో యాదవుల మంతనాలు అందుకేనా? అఖిలేష్ కోసం మజ్లిస్‌తో స్కెచ్?
Published on: Wed Jan 12, 2022 5:57PM
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ ఆయనకు అతిధి మర్యాదలు చేశారు. విందు ఇచ్చారు. ఇద్దరు నాయకులు జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ప్రగతి భవన్ వర్గాల సమాచారం. అయితే, తేజస్వి హైదరబాద్ ఎందుకు వచ్చారు? గత వారంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతా రామ్ ఏచూరి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా వచ్చినట్లుగా, ఈయన కూడా తమ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారా ? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు మర్యాద పూర్వకంగా విందు ఇచ్చారా లేక వ్యక్తి గత పని మీద హైదరాబాద్ వచ్చిన తేజస్వీ యాదవ్ మర్యాద పూర్వకంగా కేసీఆర్ ‘ను కలిశారా?అంటే అలాంటిది ఏమీ లేదు. గతంలో అఖిలేష్ యాదవ్ వచ్చి వెళ్ళినట్లుగానే, ఒక విధంగా ఆయన పర్యటనకు కొనసాగింపుగానే తేజస్వీ యాదవ్ హైదరాబాద్ వచ్చి వెళ్ళారని సమాచారం.
అంతే కానీ అలాగే, ఆయన హైదరాబాద్ ఎలా ఉందో,ఎంత అభివృద్ధి అయిందో చూసి పోదామని రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, బీహార్ యాదవ నేత తేజస్వీ యాదవ్, యూపీ యాదవ నాయకుడు అఖిలేష్ యాదవ్ దూతగానే హైదరాబాద్ వచ్చి, కేసీఆర్ ‘ను కలిశారు. రాష్ట్రంలో తెరాస, ఎంఐఎం పార్టీలు మిత్ర పక్షాలు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం గురించి వేరే చెప్పనక్కర లేదు. అవసరార్ధం అప్పుడప్పుడు వారూ వీరూ కొట్టుకున్నా, తిట్టుకున్నా ‘ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ముఖ్యమంత్రి కేసేఆర్ అనేక సందర్భాలలో చెప్పారు.
అయితే,ఇదే అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, అఖిలేష్ యాదవ్ విజయావకాశాలను, గట్టిగా దెబ్బతీస్తున్నారు. ఆయనకు కనిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ విస్తరణ పేరిట ఒవైసీ, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు పోటీకి దించుతున్నారు. గతంలోనూ ఒవైసీ, యూపీతో పాటుగా, మహారాష్ట్ర, బెంగాల్, ఇంకా కొన్ని రాష్ట్రాలలో కూడా ఎంఐఎం అభ్యర్ధులను నిలపెట్టారు.ఆ విధంగా బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటును చీల్చి, బీజేపీ గెలుపుకు సహకరించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీతో ఒవైసీకి లోపాయికారి ఒప్పందం ఉందని, లౌకిక వాద పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో.2019 లోక్ సభ ఎన్నికల్లోనూ కూడా ఒవైసీ, యూపీలో తమ అభ్యర్ధులను నిలిపారు. బీజేపీ గెలుపుకు సహక్రించారు. అయితే, ఈ సారి, ఆయన ఇతర స్థానిక పార్టీలతో కలిసి, అన్ని స్థానాల్లో పోటీకి దిగడమే కాకుండా, కేవలం ముస్లిం ఓటునే కాకుండా బీసీ, ఓబీసీ, దళిత,బహుజన ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారం సాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే ఎంఐఎంను బరిలోంచి తప్పించి లేడా పరిమితంగా పోటీలో నిలిచేలా ఒప్పించే బాధ్యతను అఖిలేష్, కేసీఆర్’ కు అప్పగించారు. ఆ కార్యం మీదనే తేజస్వీ యాదావ్, అఖిలేష్ దూతగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్’తో మంతనాలు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పనిలో పనిగా అన్నో ఇన్నో కోట్ల రూపాయల సహాయం కూడా, తేజస్వి ప్రత్యేక విమానంలో పట్టుకు పోయారని కొందరు అంటున్నారు కానీ, డబ్బులకంటే కూడా ఒవైసీతో సంధి కోసమే తేజస్వీ యాదవ్, చార్టెడ్ ఫ్లైట్’లో హైదరాబద్ వచ్చి పోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


