TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్న‌య్య కాదంటే అవున‌నేనా? వైఎస్సార్‌-జ‌గ‌న్‌ సేమ్ స్ట్రాట‌జీనా?

Published on: Fri Jan 14, 2022 6:45PM

చిరంజీవి కాదంటున్నారు. తాను రాజ‌కీయాల్లో లేనంటున్నారు. కానీ, మీడియా మాత్రం పెద్ద‌న్న‌య్య పెద్ద‌ల స‌భ‌కేనంటోంది. ఇది ప‌క్కా రాస్కో సాంబా అంటూ సోష‌ల్ మీడియా ఊద‌ర‌గొడుతోంది. 2009లో చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టినందుకు గిఫ్ట్‌గా.. వైఎస్సార్ చిరును రాజ్య‌స‌భ‌కు పంపిస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు-ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-ఫిల్మ్ఇండ‌స్ట్రీని దెబ్బ‌కొట్టేలా మెగాస్టార్‌ను జ‌గ‌న్‌ మ‌ళ్లీ పెద్ద‌వాడ్ని చేస్తున్నారని అంతా కోడై కూస్తున్నారు. సంక్రాంతి టాక్ అంతా చిరు-జ‌గ‌న్‌-రాజ్య‌స‌భ గురించే.

మెగా స్టార్ చిరంజీవి, విజయవాడ వెళ్ళారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.ఏపీలో ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినిమా రంగంలో కాక పుట్టిస్తున్న సినిమా టికెట్ రేట్ల వివాదం గురించి చర్చించారు. ఇది అందరికీ తెలిసిన విషయం,అయితే, అందరివాడి గురించి కొందరికే తెలిసిన విషయం మరొకటి వుంది. అది కూడా కావడానికి టికెట్ల వ్యవహామే..కానీ, సినిమా టికెట్ రేట్ల గోల కాదు, రాజకీయ ముచ్చట..

అవును, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించింది సినిమా టికెట్ల రేట్ల విషయంలో పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వానికి మధ్య నడుస్తున్నవివాదంపై  చర్చించేందుకే.
కానీ, ఆ ఇద్దరూ చర్చించింది మాత్రం, రాజ్యసభ టికెట్ల ‘రేట్ల’ గురించని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి, ఆ ఇద్దరూ సినిమా టికెట్ల విషయం కంటే రాజకీయంగా ఇచ్చి  పుచ్చుకోవడాల పైనే ఎక్కువగా చర్చించారని, సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని మెగా స్టార్ అప్పుడెప్పుడో అడిగిన రాజ్యసభ టికెట్’ ను ఇప్పుడు అడగకుండానే ఆఫర్ చేశారని, అంటున్నారు. అందుకు  చిరంజీవి  కూడా వెంటనే అంగీకరించారని అస్మదీయ వర్గాల సమాచారం. 

నిజానికి సినిమా టికెట్ల గోల తెర మీదకు రాకముందు ఎప్పుడోనే చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి మీడియాల్లో కొంత చర్చ జరిగింది. చిరంజీవి స్వయంగా జగన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజ్యసభ టికెట్ గురించి చర్చించారు. అలాగని, అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఎందుకనో గానీ, ఆ తర్వాత ఆ వార్త తెరమరుగై పోయింది. 

అదలా ఉంటే, ఇప్పుడు జగన్ రెడ్డి, చిరంజీవిని పిలిచి మరీ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేయడం వెనక రాజకీయ అవసరాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి,  ఒకే దెబ్బకు రెండు పిట్టలు లెక్కలు, రాజకీయ ఎత్తులు ఉన్నాయని అంటున్నారు. 

అందులో మొదటిది, తమ్ముడు పవన్ కళ్యాణ్’ను రాజకీయంగా దెబ్బ తీయడం. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి కాపు సామాజిక వర్గాన్ని రెండుగా చీల్చే ఎత్తుగడలో భాగంగానే, జగన్ రెడ్డి మెగాస్టార్’ను దువ్వుతున్నారు. ఆ విధంగా  తెలుగు దేశం పార్టీతో జట్టు కట్టేందుకు సిద్దమవుతున్న, తమ్ముడు పవన్ కళ్యాణ్’తోతెలుగు దేశం పార్టీనీ దెబ్బతీసేందుకు జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా  చిరంజీవిని పావుగా ఉపయోగించు కుంటున్నారని అనటున్నారు. గతంలో, వైఎస్సార్, చిరంజీవి చేత ప్రజా రాజ్యం పార్టీ పెట్టించి, వరసగా రెండవ సారి అధికారంలోకి వచ్చిన విధంగా, ఇప్పుడు జగన్ రెడ్డి కూడా చిరంజీవిని పావుగా వాడుకుంటున్నారని అంటున్నారు. 

అదొకటి అయితే, రెండవది రెబల్ ఎంపీ రఘురామా కృష్ణం రాజు రాజీనామా చేస్తే, ఉప ఎన్నికల్లో చిరంజీవిని నిలిపే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. నరసాపురం లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపే రెబెల్ ఎంపీ  రఘురామ కృష్ణం రాజు  ఫిబ్రవరి 5 తర్వాత రాజీనామా చేస్తానని  బహిరంగంగా ప్రకటించిన నేపధ్యంలో, ఆస్థానానికి జరిగే ఉప ఎన్నికలో అక్కడి నుంచి చిరంజీవిని బరిలో దింపాలని జగన్ రెడ్డి భావించారు. అయితే, చిరంజీవి లోక్ సభ వద్దు రాజ్య సభ ముద్దని, చిరు పెద్దల సభ వైపు మొగ్గు చూపడంతో జగన్ రెడ్డి అందుకు అంగీకరించారని అంటున్నారు. 

అదలా ఉంటే, ఈ సంవత్సరం జూన్’లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి, తెలుగు దేశం మద్దతుతో గెలిచిన బీజేపీ సభ్యుడు సురేష్ ప్రభు, తెలుగు దేశం టికెట్ పై గెలిచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి పదవీ కాలం ఈ జూన్’లో ముగుస్తుంది. ఈ స్థానాలకు  మార్చి – ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో  వైసీపీకి ఉన్న సంఖ్యా బలంతో, మొత్తం నాలుగు సీట్లు వైసీపీనే గెలుచుకుంటుంది. ఇందులో విజయసాయి మళ్ళీ అవకాశం దక్కించుకున్నా,అదనంగా వచ్చిన మూడు  సీట్లలో ఒకటి చిరంజీవి పేరున రిజర్వు అయిందని సమాచారం.