పార్టీలకి ఎన్నికల జ్వరం మొదలయింది

 

ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం కొన్ని రోజులే అన్నట్లుగా గత రెండు మూడు నెలలుగా రాష్ట్ర విభజన వైరాగ్యంతో బాధపడుతున్న ప్రజలు, రాజకీయ పార్టీలు క్రమంగా దానిని నుండి బయటపడుతున్నారు. అయితే ఈ వైరాగ్యంలో ఇంకా శాసనసభ, పార్లమెంటులో బిల్లు ఆమోదమనే రెండు దశలు మిగిలి ఉన్నాయి. ఇంత బాధని దిగమింగిన తరువాత ఆ రెండు దశలు దాటడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చును.

 

అందుకే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా ఆ వైరాగ్యం నుండి బయటపడి మరో ఆరు నెలలో వచ్చే పెద్ద పండుగకి (ఎన్నికలు) సన్నాహాలు మొదలుపెట్టాయి. క్రిందటి వారం జరిగిన తెదేపా మేధోమధనం సమావేశాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఎన్నికల సన్నాహాలకు కేవలం 100 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది గనుక పార్టీ శ్రేణులని ఎన్నికలకి సిద్దం కమ్మని కమ్మటి పిలుపునిచ్చారు. అంతేగాక నిన్న,ఈరోజు ఆయన తన కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఆ తరువాత క్లిష్టమయిన టికెట్స్ వ్యవహారం కూడా చెప్పట్టవలసి ఉంది. ఇప్పటికే ఆ విషయంలో పార్టీ చాలా కసరత్తు చేసి ఉన్నందున బహుశః వచ్చే నెలాఖరులోగా టికెట్స్ వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

 

ఇక, మొన్నజరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల గురించి చంద్రబాబు చెప్పినట్లే చెప్పారు. కానీ టికెట్స్ వ్యవహారంలో ఆ పార్టీకి కొన్నిఇబ్బందులున్నాయి. ఆ పార్టీ తెలంగాణా లో పోటీ చేయదలిస్తే అక్కడ ఎవరయినా ఆసక్తి చూపుతారా? అనే అనుమానం ఉంది. ఇక ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించిన కారణంగా, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి, పార్టీలో మొదటి నుండి ఉన్నవారికీ టికెట్స్ కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అందువల్ల వైకాపా తన అభ్యర్దులను ఖరారు చేయడానికి మరో రెండు నెలలు పట్టవచ్చును.

 

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే చాలా అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం టీ-కాంగ్రెస్ నేతలు ఏవో జైత్రయాత్రలు, సోనియమ్మ భజన కార్యక్రమాలు నిర్వహించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ వారి భవిష్యత్ మొత్తం తెరాస తీసుకొనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఒకవేళ తెరాస కాంగ్రెస్ తో ఎన్నికల పోత్తులకి అంగీకరిస్తే టీ-కాంగ్రెస్ ముసలి గుర్రాలు తమ టికెట్స్ పై ఆశలు వదులుకోవలసిందే. కానీ సీమాంధ్ర తో పోలిస్తే గుడ్డిలో మెల్ల అన్నట్లు తెలంగాణాలో పరిస్థితి కొంత బాగానే ఉందనుకోవచ్చును.

 

సీమాంధ్రలో నేతలు కాంగ్రెస్ పేరు చెప్పుకోవడానికి కూడా జంకుతున్నారు. కానీ ప్రజలకు ‘షార్ట్ మెమొరీ ప్రాబ్లెం’ ఎక్కువ ఉంది గనుక త్వరలోనే వారు ‘సమైక్యాంధ్ర’ వైరాగ్యం నుండి బయటపడి ‘కొత్త రాజధాని ఎక్కడ పెట్టాలి?’ అనే రసవత్తరమయిన చర్చలో పడిపోతే కాంగ్రెస్ పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.