TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘రాజకీయ అనాథ’ శివాజీ!

Published on: Mon Jun 24, 2024 5:20PM

అదేంటోగానీ, నటుడు శివాజీ రాజకీయంగా అలుపెరుగని పోరాటం చేస్తూ వుంటారు... ఏ విషయం మీద అయినా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతూ వుంటారు... మనకెందుకొచ్చిన గొడవ అని తప్పుకుని పోకుండా ఎదిరించి నిలబడతారు... చాలామంది రాజకీయ నాయకులకంటే చాలా తెగింపు వున్న నాయకుడిగా కనిపిస్తారు... కానీ, ఆయన ‘రాజకీయ అనాథ’గానే మిగిలిపోయారు.

నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న శివాజీ, తాను నటుడిగా బిజీగా వున్న సమయంలో కూడా రాజకీయంగా తనకున్న అవగాహనని పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో చాలామంది నటీనటులు ‘సినిమా వాళ్ళకి రాజకీయాలకి సంబంధం లేదు’ అని లౌక్యంగాతప్పించుకున్నప్పటికీ, శివాజీ మాత్రం రాష్ట్ర విభజన జరగడానికి విల్లేదంటూ నినదించారు. తన గళాన్ని బలంగా వినిపించారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. అప్పటి టీఆర్ఎస్‌కి చెందిన కొందరు అతివాదులు శివాజీని వ్యక్తిగతంగా కూడా దూషించారు. అయినప్పటికీ శివాజీ వెనకడుగు వేయలేదు.

ఆ తర్వాత శివాజీ నవ్యాంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకుడిగా కొంత కాలం చురుకుగా పనిచేశారు. అయితే, అప్పటికే బీజేపీలో ముదిరిపోయి వున్న సోము వీర్రాజుకి, శివాజీకి ఎక్కడో చెడింది. శివాజీ తనను దాటుకుని వెళ్ళే అవకాశం వుందని సోము వీర్రాజు భావించారో ఏమోగానీ, ఆయన శివాజీని పార్టీలో ఎంతమాత్రం ఎదగనివ్వలేదు. ఒక సందర్భంలో అయితే ‘శివాజీ మా పార్టీలోనే లేడు’ అని చెప్పారు. అప్పటి వరకు రాజకీయంగా కనీసం ‘బీజేపీ’ ముద్ర అయినా వున్న శివాజీ ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు. శివాజీ ఆలోచనా విధానాలు తెలుగుదేశం పార్టీ తరహాలోనే వుంటాయి. అయినా సరే ఆయన తెలుగుదేశం పార్టీకి చేరువ కాలేదు. అడపాదడపా తెలుగుదేశం పార్టీ మీద కూడా విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని విమర్శించారు కాబట్టి, వైసీపీకి చేరువ అయ్యారా అంటే, అదీ లేదు. వైసీపీ అంటే తనకు పడనట్టే వున్నారు. రాజకీయంగా అవగాహన, వాయిస్ వున్నప్పటికీ ఆయన ఏ పార్టీకి చేరువ కాకుండా ‘రాజకీయ అనాథ’గా మిగిలారు.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి, జగన్ అధికారంలోకి వచ్చి, మూడు రాజధానుల ముష్టి సిద్ధాంతం బయటకి వచ్చిన తర్వాత శివాజీ ఆ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ విధానాల మీద తన వ్యతిరేకతను వ్యక్తం చేయడం వల్ల అప్పటి వరకూ తటస్తంగా కనిపించిన శివాజీ ఒక్కసారిగా వైసీపీ వర్గాలకు టార్గెట్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా పిశాచాలు శివాజీ మీద విరుచుకుపడ్డాయి. సరే, వైసీపీకి వ్యతిరేకంగా వున్నారు కదా, టీడీపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా అని ఆయన టీడీపీకి చేరువ కాలేదు. చాలా సందర్భాల్లో టీడీపీకి బాహాటంగా తనమద్దతు ప్రకటించారు. అయినప్పటికీ ఆయన టీడీపీకి బయటి వ్యక్తిలాగానే వున్నారు. ఎన్నికలు జరిగే సమయంలోనూ, ఎన్నికలకు, ఫలితాలకు మధ్యకాలంలోనూ ఆయన టీడీపీయే గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనూ ఆయన ఆనందోత్సాహాలతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఏపీలోని ఒక పౌరుడి హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారే తప్ప.. తెలుగుదేశం నాయకుడి హోదాలో కాదు.

శివాజీ ఏ రాజకీయ పార్టీకి  కావాలనే చేరువ కావడం లేదా.. లేదా ఆయనని ఏ పార్టీ చేరువ కానివ్వడం లేదా? ఇది విత్తుముందా.. చెట్టుముందా లాంటి సంక్లిష్టమైన ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో నిరంతరం ఎవరో ఒకరు చేరుతూనే వుంటారు. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వుండే శివాజీని తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆహ్వానించలేదు? తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల నమ్మకం వున్న శివాజీ ‘రాజకీయ అనాథ’లా మిగలకుండా, ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? తెలుగుదేశం పార్టీలో చేరి, ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకుని, విజయం సాధించే అవకాశం వున్నప్పటికీ ఆయన ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఒకవేళ చేసినా వర్కవుట్ కాలేదా? తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థల మీద విరుచుకుపడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా అమరావతి మీద తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేశారు.  అయితే ఇది కూడా ఒంటరి శివాజీగానే.. మరి రాబోయే కాలంలో కూడా శివాజీ ఇలా ‘రాజకీయ అనాథ’గానే వుంటారో, ఏదైనా పార్టీ చేతిని, అండని అంది పుచ్చుకుంటారో!?