అక్కినేనికి రాజకీయ ప్రముఖుల సంతాపం

 

 

 

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరావుకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్, చంద్రబాబు, డిప్యూటీ సీఎం దామోదర, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, చిరంజీవి, హరికృష్ణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, డీఎస్, స్పీకర్ నాదెండ్ల , నన్నపనేని రాజకుమారి, రామానాయుడు, ఎస్పీబాలు, వైఎస్ విజయలక్ష్మి తదితరులు నివాళులర్పించారు.

 

ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సంతాపం ప్రకటించారు.అక్కినేని అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. అక్కినేని మరణం సినీ పరిశ్రమతో పాటు సమాజానికి తీరని లోటన్నారు.అక్కినేని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.



అక్కినేని నాగేశ్వరరావు పార్థివదేహానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కినేని గొప్ప కళాకారుడే కాదు మానవత్వం మూర్తీభవించిన మహామనిషి అని కొనియాడారు. తెలుగు చలన చిత్ర వినీలాకాశంలో ఒక ధృవతార రాలిపోయిందని జేపీ అన్నారు.



అక్కినేని సుదీర్ఘ నటనా ప్రస్థానం...ఆయన మరణంతో ఒక శకం ముగిసిందని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. అక్కనేని పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు.