TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జిన్నా టవరేంటి..? జిన్నా సెంటర్ ఏంటి? ఈ హీట్ ఏంటి..?

Published on: Fri Dec 31, 2021 3:34PM

చలికాలంలో కూడా ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది గుంటూరులో దశాబ్దాల క్రితం నిర్మించిన జిన్నా టవర్. జిన్నా టవర్ను కూల్చేయాలనే వాదాన్ని తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యప్రసాద్ కొద్ది రోజుల క్రితమే తెర మీదకు తెచ్చారు. దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్లలో లక్షలాది మంది మరణానికి కారకుడైన దేశద్రోహి జిన్నా పేరు గుంటూరులో ఓ సెంటర్ కు పెట్టడమేంటనేది సత్య ప్రసాద్ వాదన. ఆ సెంటర్ కు జిన్నా పేరు తీసేయాలని, ఆ పేరు వెంటనే మార్చేయాలని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. సత్యప్రసాద్ చేసిన ఈ డిమాండ్ ను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి సమర్ధించారు. జిన్నా టవర్ ఉన్న ప్రాంతం జిన్నా సెంటర్ గా పేరులో ఉంది. ఇది ఏ పాకిస్తాన్ లోనో లేదని, దురదృష్టం కొద్దీ గుంటూరులో ఉందని విష్ణు విమర్శించారు. దేశ ద్రోహి జిన్నా పేరు అలాగే ఉంచాలా? లేక అబ్దుల్ కలామ్ పేరో లేదా కవి గుర్రం జాషువా పేరో ఎందుకు పెట్టలేదని సత్యప్రసాద్ ప్రశ్నించారు. సత్య ప్రసాద్ వ్యాఖ్యల్ని విష్ణువర్ధన్ రెడ్డి రీ ట్వీట్ చేయడంతోనే పొలిటికల్ హీట్ పెరిగింది. అక్కడితో ఆగని విష్ణువర్ధన్ రెడ్డి జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే బాబ్రీ మసీదు కూల్చేసినట్టు కూలదోస్తామని హెచ్చరించడంతో మరింతగా రాజకీయ అగ్గి రాజుకుంది.

విష్ణువర్ధన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు ప్రతిస్పందిస్తున్నారు. వివాదాస్పదం అయిన జిన్నా టవర్ పై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వం గల దేశం మనదన్నారు. ఉద్దేశం ఏదైనా సరే ఉన్న కట్టడాలను తొలగించాలనే వాదన సరికాదని తప్పుపట్టారు. జిన్నా టవర్ కూల్చివేత నెపంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం తగదని బీజేపీ నేతలకు సుచరిత హితవు పలికారు. జిన్నా ఏం నష్టం చేశాడు, ఏం మేలు చేశాడనేది టవర్ వల్ల తెలుసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం సరికాదని ఖండించారు. కొత్త నిర్మాణాలు చేయండి.. కానీ ఉన్న వాటిని తొలగించవద్దని దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పిన మాటల్ని హోంమంత్రి సుచరిత ప్రస్తావించారు.

జిన్నా టవర్ ను కూల్చాలన్న  బీజేపీ నేతల వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నేతలు కూడా ఖండిస్తున్నారు.  జిన్నా టవర్ ను కూల్చాలంటే ముందుగా ఢిల్లీలోని పలువురు ముస్లిం నేతలు, పాలకుల పేర్లతో ఉన్న మార్గ్ లను మార్చాలని,  భవంతులను కూల్చాలని, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయే కనుక, ఢిల్లీ పోలీసు వ్యవస్థ కూడా కేంద్రం చేతిలోనే ఉంది కాబట్టి కూల్చివేతలు అక్కడి నుంచే ప్రారంభించాలని సూచిస్తున్నారు. దేశంలోని గుజరాత్ సహా పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో ముస్లిం నేతలు, పాలకుల పేర్లతో ఉన్న చిహ్నాలను తొలగించాలనేది విశ్లేషకుల సూచన. గుజరాత్ లోని ఒక్క ముస్లిం కూడా లేని ఓ గ్రామానికి పాకిస్తాన్ అనే పేరు ఇప్పటికీ ఉండడాన్ని రాజకీయ  విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. పాకిస్తాన్ పేరును మార్చాలని ఆ గ్రామస్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారట. పాకిస్తాన్ గ్రామం పేరు మార్చని కేంద్రం, బీజేపీ ఇప్పుడు జిన్నా టవర్ పై ఎందుకు పడ్డారనే సూటి ప్రశ్న పలువురి నుంచి వస్తోంది.

ఏపీలో ఏమాత్రం ఉనికి ప్రదర్శించలేకపోతున్న బీజేపీ ఏదో ఒక విధంగా నలుగురి దృష్టినీ ఆకర్షించాలనే పక్కా ప్రణాళికలో భాగంగానే జిన్నా టవర్ అంశాన్ని పొలిటికల్ తెరమీద చర్చనీయాంశం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరో పక్కన ప్రజా ఆగ్రహ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేపిన ‘చీప్ లిక్కర్’ వివాదం నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే జిన్నా టవర్ టాపిక్ ను బీజేపీ నేతలు లేవనెత్తారనే విమర్శలు కూడా వస్తున్నాయి. సున్నితమైన అంశాలు లేవనెత్తి ప్రజల మధ్య విధ్వేషాన్ని బీజేపీ పెంచుతోందని ముస్లిం చేత మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక పక్కన వైసీపీ నేతలు, రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యల్ని ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి మరో కొత్త వాదం తెరమీదకు తేవడం గమనార్హం. జిన్నా టవర్ ను కూల్చవద్దంటే దేశంపై దండయాత్రలు చేసి వేలాది విగ్రహాలను మహ్మద్ గజనీ, ఘోరీలు ధ్వంసం చేసిన సందర్బాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా? అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడడం గమనార్హం.

 జిన్నా టవర్ ఏంటి? జిన్నా సెంటర్ ఏంటి? దాని చారిత్రక నేపథ్యం ఏంటీ.. 

మన దేశ స్వాతంత్యానికి ముందు నిర్మించిన కట్టడం జిన్నా టవర్. స్వాతంత్ర్య సమరయోధులు అప్పట్లో జిన్నా టవర్ నిర్మాణానికి మద్దతిచ్చారని చరిత్ర చెబుతోంది. 1942లో ప్రస్తుత సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో మత ఘర్షణలు జరిగాయి. దాన్ని స్వాతంత్ర పోరాటంగా మరల్చారనే వివాదంలో స్థానిక కోర్టు 14 మంది ముస్లింలకు ఉరిశిక్ష విధించింది. వారి తరఫున వాదించిన జిన్నా ఉరిశిక్షను రద్దు చేయించారు. దీనికి గుర్తుగా 1942లో స్వాతంత్ర్య ఉద్యమకారులు మహ్మద్ అలీ జిన్నా పేరు మీద గుంటూరులో టవర్ నిర్మించారు. ఈ టవర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినా.. వచ్చేందుకు జిన్నాకు వీలు పడలేదు. జిన్నా తరఫున ఆయన అనుచరుడు జులేదా లియాఖత్ అలీకాన్ 1945లో టవర్ కు ప్రారంభోత్సవం చేశారు.

అప్పటి నుంచీ జిన్నా టవర్ నిర్వహణ బాధ్యతను గుంటూరు నగర పాలక సంస్థే చూసుకోవడం విశేషం.జిన్నా టవర్ పేరు మార్చాలని గతంలో కొన్ని సార్లు అప్పటి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానాలు జరిగినా ఎందుకో ఆ తీర్మానాలు అమలులోకి రాకపోవడం గమనార్హం.