అన్నదమ్ముల మధ్య అగాధం!!

 

ఒక్క మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా? ఎవరీ అన్నదమ్ములెవరు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో మంత్రి పదవుల రేసులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు పేర్లు విన్పించగా, అందులో ముఖ్యులుగా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం నిలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేసారు. సీనియారిటీ, గత అనుభవాల దృష్ట్యా ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పదవి లభిస్తుందని ఆయనతో పాటు ఆయన వర్గం ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధర్మాన ప్రసాదరావుకు కాక ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు.

ధర్మాన ప్రసాదరావుకు కాకుండా కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసి, సుధీర్ఘ అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావును కాకుండా ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రిగా నియమించడంపై జిల్లా పార్టీలో వ్యతిరేక స్వరం మొదలయ్యిందట. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అగాథం పెంచిందట.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన ధర్మాన కృష్ణదాస్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసారు. రైల్వే స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయం చేరుకునే వరకు ధర్మాన కృష్ణదాస్ కు స్వాగతం పలికేందుకు ఎక్కడా ధర్మాన ప్రసాదరావు రాలేదు. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు వస్తారని కొద్దిసేపు కార్యక్రమాన్ని వాయిదా వేసినా ఆయన రాకపోవడంతో చేసేదేమిలేక కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యాలయంలోనే ఉండి కూడా కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే ధర్మాన ప్రసాదరావు అనుచరులు ధర్మాన కృష్ణదాస్‌ ఫ్లైక్సీలను వెంటనే తొలగించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఇలా చేసారని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారట.

మొత్తం మీద ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతుందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగానే తాజాగా తెరపైకి వచ్చిన అన్నదమ్ముల పదవీ వైరం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. మరి సోదరుల పంచాయితినీ, వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.